అలరించిన జాతీయ కవిసమ్మేళనం
నంద్యాల(వ్యవసాయం): సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీశైల హైస్కూల్ సెమినార్ హాల్‌లో నిర్వహించిన జాతీయ కవిసమ్మేళనం సాహితీవేత్తలు, ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి, మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నం నేతృత్వంలో కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు, రచయిత డాక్టర్ కిశోర్ కుమార్, బేతంచర్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియాదాసు, కవులు నీలకంఠమాచారి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. కవిత్వమనేది కవి గుండెల్లో నుంచి ఉప్పొంగి అక్షర రూపం దాల్చి సమాజానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. ‘పసిడి నవ్వులు వెన్నెల దివ్వెలు’ అనే అంశంపై అనేక మంది కవులు వివిధ జిల్లాల నుంచి పాల్గొని తమ కవితలను చదివి వినిపించారు. సంస్థ నిర్వాహకులు కవుల సాహిత్య సేవకు గుర్తింపుగా జానపద మంజరి సేవా పురస్కారాలు, బాల చైతన్య సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కవులు వెంకటేశ్వర్లు, నరేంద్ర, మహమ్మద్ రఫి, శేషఫణి, మాబుబాష, కేశవమూర్తి పాల్గొన్నారు.


