కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి పేదలకు అన్యాయం చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కష్టాలతో జీవనం సాగించేలా పాలన సాగుతోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా, తన అనుచరులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఆలూరులో నిర్వహించే ర్యాలీకి సంబంధించి వాల్‌పోస్టర్లును ఆదివారం ఆలూరులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందేలా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు సాధించి, అందులో ఐదు పూర్తి చేశారన్నారు. మిగిలిన వాటిని పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గం అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేసినా ప్రభుత్వంలో కనీసం స్పందనలేదన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు తాము, తమ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, బీసీసెల్ కార్యదర్శులు శ్రీనివాసులు, భాస్కర్, వీరేషప్ప, ఈరన్న, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీలు దేవరాజ్, బాషా, బోయ ఎల్లమ్మ, మోతి ఎల్లమ్మ, నాగమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కిశోర్, ఎస్‌సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.


