ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
కర్నూలు: ‘నేను బయోమెడికల్ కోర్సు పూర్తి చేశాను. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు సి.క్యాంప్‌నకు చెందిన రాఘవరెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడ’ని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన నరసింహులు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 99 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సంబంధ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్‌పీడీసీఎల్ కార్యాలయం నుంచి నిర్వహించిన ఈకార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పలువురు వివిధ సమస్యలను సీఎండీ దృష్టికి తెచ్చారు. వాటిని సత్వరం పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్‌ఈలను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్‌ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చునన్నారు.
జిల్లాలో పోలీసులు అప్రమత్తం
● ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో
ఆకస్మిక తనిఖీలు
కర్నూలు: ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా అంతటా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎస్పీ గుత్తి పెట్రోల్ బంకు దగ్గర చేపట్టిన వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర, జాతీయ, గ్రామీణ రహదారుల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఉద్యోగం పేరుతో మోసం
ఉద్యోగం పేరుతో మోసం


