కలుషిత ఆహారంతో పదిమంది చిన్నారులకు అస్వస్థత
● ఆదోని మండలం నాగలాపురం
అంగన్‌వాడీ కేంద్రంలో ఘటన
కర్నూలు (అర్బన్): ఆదోని మండలం నాగలాపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం కలుషిత ఆహారం తిని పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులకు సంబంధిత అంగన్‌వాడీ టీచర్ ముందుగా పాలు ఇచ్చారని, మధ్యాహ్నం అన్నం, సాంబారు పిల్లలకు పెట్టినట్లు సమాచారం. ఈ ఆహారం తిన్న వెంటనే పది మంది చిన్నారులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమాచారాన్ని సంబంధిత అధికారులకు, వైద్య సిబ్బందికి చేరవేయడంతో హుటాహుటిన వైద్యసిబ్బంది అక్కడికి చేరుకుని అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్య సహాయం అందించారు. అయితే, 9 మంది చిన్నారులకు అక్కడే శిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందించి, మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న ఆదోని ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు.


