గ్రామాల్లో టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు
● కలెక్టర్ సిరికి విన్నవించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయ కులు నిరంకుశంగా వ్యవహరిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై కల్టెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ..కల్లూరు మండలం బొల్లవరంలో ఉన్న నీలం రామచంద్రయ్య గ్రామైక్య సంఘంలో మొత్తం 27 సంఘాలు ఉండగా..ఐక్య సంఘం లీడర్‌ను కేవలం 14 సంఘాల లీడర్లతోనే ఎన్నుకున్నారని, అన్ని సంఘాల మద్దతుతో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం బుక్‌కీపర్‌గా ఉన్న కృష్ణమోహన్‌నాయుడును కొనసాగించాలని, ఆయన సెల్‌ఫోన్‌ను బ్లాక్ చేయడం అన్యాయమని చెప్పారు. అలాగే ఓర్వకల్ మండలం మీదివేములకు చెందిన భూములను ఏపీఐఐసీ సేకరించిందని, ఆ గ్రామానికి చెందిన 37 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే పరిహారం ఇచ్చిందని, బోర్లు, బావులు, చెట్లకు కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. వెంటనే రైతులందరికీ పరిహారం ఇవ్వాలని కోరారు.


