మంత్రాలయం..భక్తజనసంద్రం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కల్పతరు క్యూలైన్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్ వేలాదిమంది భక్తులతో కిక్కిరిసి కనిపించింది.
నేటి నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు 6,7 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ జిల్లా సాధారణ పరీక్షల విభాగానికి పంపించారు. అక్కడి నుంచి హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎంఈఓ ఆఫీస్‌కు పంపుతారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు ఆయా క్లస్టర్ స్కూళ్ల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకపోవాల్సి ఉంటుంది.
ఈజీ మనీ కోసం ఆశపడొద్దు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (టౌన్): ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈజీ మనీ కోసం ఆశపడితే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. రూ. లక్ష పెడితే రూ. కోట్లు వస్తాయంటే కచ్చితంగా మోసమే అని తెలిపారు. ఎపీకే ఫైల్స్ ఇన్‌స్టాల్ చేయవద్దని, అలాగే అపరిచిత లింక్స్ క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు.
నేడు డయల్ యువర్ ‘సీఎండీ’
కర్నూలు (టౌన్): విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈనెల 10 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 సెల్ నంబర్‌ను ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు తెలియజేయాలని తెలిపారు. అలాగే వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు, 1800425 155333కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వాట్సప్ నంబర్ 9133331912కు చాట్ చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
మంత్రాలయం..భక్తజనసంద్రం


