
స్వామిత్వ వేగవంతానికి చర్యలు
కర్నూలు(అర్బన్): గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్ల యజమానులకు హక్కు పత్రాల జారీకి సంబంధించిన స్వామిత్వ (సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్‌డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ ) కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. మంగళవారం పీఆర్‌అండ్‌ఆర్‌డీ కమిషనర్ క్రిష్ణతేజ నిర్వహించిన గూగుల్ మీట్‌లో డీపీఓ మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి జిల్లాలోని 73 రెవెన్యూ గ్రామాల్లో స్వామిత్వ కార్యక్రమాలను వేగవంతం చేశామన్నారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలను నిర్వహించామని, 44 గ్రామాల్లో గ్రామ కంఠం మ్యాపింగ్ కూడా పూర్తయిందన్నారు. ఆయా గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ కూడా జరుగుతోందని వివరించారు.
పంచాయతీలపై అధనపు భారం
జిల్లాలో చేపట్టిన స్వామిత్వ సర్వేకు సంబంధించిన ఆర్థిక భారం ఇక నుంచి గ్రామ పంచాయతీలపై పడనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారాన్ని మోపకుండా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే కూటమి ప్రభుత్వం స్వామిత్వకు సంబంధించి గ్రామాల్లో చేపట్టే పనులకు అయ్యే వ్యయాన్ని గ్రామ పంచాయతీలే భరించాలని ఇటీవలే పీఆర్‌అండ్‌ఆర్‌డీ కమిషనర్ క్రిష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎలాంటి ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అధికారుల ఆదేశాలను కాదనలేక, చేతి నుంచి డబ్బు వెచ్చించలేక ఇబ్బంది పడుతున్నారు.