
వేడుకలకు ముస్తాబైన పోలీసు పరేడ్ మైదానం
కర్నూలు/కర్నూలు(సెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మైదానమంతా చిత్తడిగా మారింది. శుక్రవారం కూడా వర్షం కొనసాగితే అధికారులకు ఇబ్బంది లేకుండా రెయిన్‌ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. కొండారెడ్డి బురుజు విద్యుద్దీపకాంతుల నడుమ వెలిగిపోతోంది. ఉదయం 9.05 గంటలకు మంత్రి టీజీ భరత్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర అధికారులు పాల్గొంటారు. పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ను గురువారం ఉదయం ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇకపోతే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శనకు శకటాలు ముస్తాబవుతుండగా.. పలు స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన సుమారు 400 మంది ఉద్యోగులు ప్రశంసా పత్రాలు అందుకోనున్నారు.