
రంగంలోకి అమాత్యుడు.. దోచేస్తున్న స్నేహితుడు!
‘క్లాస్‌మేట్ల’ బియ్యం దందా!
● వ్యాపారులు, రేషన్ డీలర్లతో సమావేశం
● తన స్నేహితునికే
విక్రయించాలని హుకుం
● కొందరు నిరాకరించడంతో
విజిలెన్స్ దాడులు
● ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా
పేదల బియ్యం స్నేహితునికే అమ్మకం
● కర్నూలులో రెండు గోదాములు
● రాత్రిళ్లు సరిహద్దులు దాటిస్తున్న వైనం
కర్నూలు(సెంట్రల్): పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా తక్కువ ధరతో బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఓ అమాత్యుడు నేరుగా తన స్నేహితుడితో(క్లాస్‌మేట్‌తో) అక్రమ బియ్యం వ్యాపారం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగం అటువైపు చూడడం లేదని, కనీసం తనిఖీలు చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా అక్రమ బియ్యం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల అండతో కొందరు వ్యాపారులు అక్రమ బియ్యం వ్యాపారాన్ని చేసేవారు. పేదల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని యథేచ్ఛగా జిల్లా దాటించేవారు. అయితే పరిస్థితి మారిపోయింది. తన స్నేహితుడి కోసం ఓ అమాత్యుడు రంగంలో దిగాడు. ఆయనే నేరుగా జిల్లాలో అక్రమ బియ్యం వ్యాపారం చేసే వ్యాపారులు, రేషన్ డీలర్లు, ఇతరులను పిలిపించి మాట్లాడి.. తన స్నేహితుడు, టీడీపీ నాయకుడైన ‘ఖాన్’కు అమ్మాలని సూచించాడు. ఇందుకు ఒప్పుకోకపోతే ఎవరూ వ్యాపారం చేసుకోలేరని భయపెట్టాడు. అయితే కొందరు ఒప్పుకోకపోతే విజిలెన్స్ దాడులు చేయించి వారిపై కేసులు నమోదు చేయించినట్లు సమాచారం. అంతేకాక వారి వ్యాపారంపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. చివరకు అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారంతా అమాత్యుడి స్నేహితుని కింద వ్యాపారం చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జిల్లా మొత్తం అమాత్యుడి క్లాస్‌మేట్ కనుసన్నల్లోనే అక్రమ బియ్యం వ్యాపారం కొనసాగుతోంది.
ప్రతి నెలా సమీక్ష
అక్రమ బియ్యం వ్యాపారంపై ప్రతి నెలా సదరు అమాత్యుడు సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. జిల్లా మొత్తానికి తన స్నేహితుడే వ్యాపారం చూసుకుంటున్నా వచ్చే లాభాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో రెండుచోట్ల అక్రమ బియ్యానికి సంబంధించి గోదాములు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి నేరుగా రాత్రిళ్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతోంది.
నిద్దరోతున్న నిఘా
పేదల బియ్యాన్ని అమ్మడానికి వీలు లేదు. కొనుగోలు చేయడానికి ఎవరూ సాహసించకూడదు. అయినా అమ్మేవాళ్లు అమ్ముతున్నారు.. కొనుగోలు చేసేవాళ్లు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నా పౌర సరఫరాల అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ నిఘా ఉన్నా అమాత్యుడు, అతని స్నేహితుడు రంగంలో ఉండడంతో వారు కూడా అటువైపు చూడడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎన్ని నిబంధనలు ఉన్నా పేదల బియ్యం మాత్రం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.
ఇదీ దోపిడీ..
కర్నూలు జిల్లాలో 6,52,452 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో దాదాపు 12 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం 12 వేల టన్నుల బియ్యం కేటాయిస్తోంది. ఇంటి ఖర్చులు ఎక్కువ కావడంతో కొన్ని సందర్భాల్లా పేదలు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాపారులు దీన్నే ఆసరగా చేసుకొని ‘ ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఏమీ బాగుండవని.. తమకు అమ్మాలి’ అని ఒత్తిడి చేస్తారు. బహిరంగ మార్కెట్‌లో రేషన్ బియ్యానికి బాగానే ధర ఉండగా వీరు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.10 ప్రకారం కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని అమాత్యుడి క్లాస్‌మేట్‌కు కేజీ రూ.13 ప్రకారం అమ్ముతున్నాడు. పేదల బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.