
నీట మునిగిన ఆశలు
పంటలకు అధిక వర్షాల గండం
● దాదాపు 2వేల హెక్టార్లలో
పత్తి పంటకు నష్టం
● దెబ్బతింటున్న కంది, ఉల్లి, వేరుశనగ,
సజ్జ పంటలు
మండలం వర్షపాతం(మి.మీ)
కర్నూలు అర్బన్ 41.4
కర్నూలు రూరల్ 39.2
కల్లూరు 36.2
చిప్పగిరి 28.4
హాలహర్వి 11.4
కర్నూలు(అగ్రికల్చర్): కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలతో రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. రెండు, మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 21 మండలాల్లో వర్షపాతం నమోదైంది. వర్షాలు అతివృష్టిగా మారడంతో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంటలు నీట మునిగి కుళ్లిపోతుండటంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 132 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా ఆదోని, తుగ్గలి, ఆస్పరి, ఆలూరు, పెద్దకడుబూరు, కర్నూలు రూరల్ తదితర మండలాల్లో వేలాది హెక్టార్లలో పత్తి, కంది, ఉల్లి, వేరుశనగ, సజ్జ తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఈ సారి పశ్చిమ ప్రాంతంలో 2.14 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. అధిక వర్షాల వల్ల ఒక్క పత్తి మాత్రమే దాదాపు 2వేల హెక్టార్లలో దెబ్బతినింది. అధికార యంత్రాంగం మాత్రం వ్యవసాయ, ఉద్యాన పంటలు కలిపి 658.7 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఉద్యాన పంటలకు రూ.2.94 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉల్లి పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తోంది. వందలాది హెక్టార్లలో ఉల్లి పంట కోశారు. వరుసగా అధిక వర్షాలు పడుతుండటంతో నీళ్లలో మునిగి ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, తుగ్గలి తదితర మండలాల్లో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 14న కర్నూలు జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.

నీట మునిగిన ఆశలు