
మళ్లీ మొదటికొచ్చిన వీఏఏల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బదిలీల్లో అన్యాయంపై సుమారు 40 మంది వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు మూడు వారాల క్రితం ఎక్కడి వారిని అక్కడే కొనసాగించాలని స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు జిల్లాల నుంచి కోర్టును ఆశ్రయించగా.. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు నిర్ధారించింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో బదిలీల కౌన్సెలింగ్ తిరిగి చేపట్టాలని ఈనెల 11న ఆదేశించడం గమనార్హం.
చేతులు మారిన రూ.16లక్షలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 474 మంది వీఏఏలు ఉండగా 447 మందిని బదిలీ చేశారు. రేషనలైజేషన్ వల్ల ఉమ్మడి జిల్లాలో 188 రైతుభరోసా కేంద్రాలు మూత పడ్డాయి. ప్రధానంగా నంద్యాల జిల్లాలో 117 ఆర్‌బీకేలు మూతపడ్డాయి. ఈ కారణంగా చాలామంది వీఏఏలు కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు. అయితే బదిలీల్లో ముడుపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16లక్షలు చేతులు మారినట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. బదిలీలకు సంబంధించి విడుదల చేసిన జీఓ(23, 5)లను ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిన్న ఉద్యోగులనూ దోచుకున్నారు
గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల్లో రాజకీయ సిఫారసులకే పెద్దపీట వేశారని తెలుస్తోంది. కూటమి పార్టీల నేతలు చిన్న ఉద్యోగులను కూడా వదలకుండా అందిన కాడికి వసూలు చేసుకొని సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు ప్రకారం వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఏకంగా 115 మంది వీఏఏలు ప్రజాప్రతినిధుల సిఫారుసుతో కోరుకున్న చోటుకు బదిలీ అయినట్లు హైకోర్టు గుర్తించింది. సిఫారసులు లేకుండానే కొరుకున్న చోటుకు బదిలీ చేసినందుకు కొందరు అధికారులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ముడుపుల వసూళ్లలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ ఏఓల్లో ఒకరు కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బదిలీలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
115 మందికి ప్రజా ప్రతినిధుల
సిపారసు లేఖలు
రూ.16లక్షల వరకు వసూలు
చేసిన కూటమి నేతలు
ప్రత్యేక కౌంటర్ తెరిచిన కొందరు
అధికారులు
నిబంధనలకు లోబడి బదిలీలు
చేపట్టాలని హైకోర్టు ఆదేశం
అభాసుపాలైన వ్యవసాయ శాఖ
ముడుపులు ఇచ్చుకొని కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకున్నాం.. మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే తమ పరిస్థితి ఏమిటని వీఏఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డబ్బులు పోయి, తిరిగి పోస్టింగ్ ఆ ప్రాంతానికే వస్తుందో రాదోననే కొందరు వీఏఏలు సతమతం అవుతున్నారు. ఇటీవల చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీలతో వ్యవసాయ శాఖ అభాసుపాలైంది. గ్రామస్థాయిలోని వీఏఏల బదిలీల్లో సైతం ముడుపుల వ్యవహారం ఈ శాఖ పరువును బజారున పడేసింది.