
అవినీతి కేంద్రం.. ఆర్టీఏ కార్యాలయం
● ప్రతి పనికీ రేటుకట్టి అదనపు వసూళ్లు ● ఇతర రాష్ట్రాల వాహనాల బదిలీకి ప్రత్యేక ‘ధరలు’ ● లంచాల వసూళ్లకు ప్రైవేటు సైన్యం ● కార్యాలయం వద్ద ఒకరు.. పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద మరొకరు ● ఆలిండియా పర్మిట్ చలానాకూ పైసలదే పైచేయి ● ఏజెంటు ద్వారా వెళితే ఎలాంటి సమస్యకై నా పరిష్కారం ● నేరుగా వెళితే చుక్కలు చూపుతున్న ఉద్యోగులు
ప్రభుత్వం నిర్ణయించిన రుసుముతోనే అందించాల్సిన సేవలకు అదనంగా ముట్టజెబితే కానీ పని జరగని పరిస్థితి. ఆఫీసులోనే ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా వస్తే వివిధ కారణాలను సాకుగా చూపి అర్జీని వారం, పది రోజులు పరిశీలనలో పెట్టి తిప్పుకోవడం పరిపాటిగా మారింది.
రవాణా కార్యాలయానికి దళారులు రాకూడదు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులకు స్థానం లేదు. నేరుగా కార్యాలయానికి వచ్చి పనులు చేయించుకునే విధానం అమలులో ఉంది. మా ఉద్యోగులే సహాయకులుగా అన్ని పనులూ చేసిపెడతారు. సీసీ కెమెరాల నిఘాలో కార్యాలయం ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని పనులు పూర్తి చేసుకోవచ్చు.
కర్నూలు: రవాణా శాఖ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎక్కడా అధికారులు, ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ప్రైవేటు వ్యక్తులే అంతా చక్కబెట్టుతున్నారు. కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన మామూళ్ల సమాచారం ఓ కీలక ఉద్యోగికి ప్రైవేటు వ్యక్తి ‘సత్యం’ వెళ్లి లెక్కలు చక్కబెబుతాడు. చేసిన పనిని బట్టి ఏజెంట్ల నుంచి తమకు రావాల్సిన వాటా డబ్బులు పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద మరో ప్రైవేటు వ్యక్తి ‘హరూన్’ ద్వారా రాబట్టుకుంటున్నారు. అధికారుల తరఫున ఈ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం సాగుతోంది. ఏజెంట్లు, అధికారుల మధ్య ప్రయివేట్ వ్యక్తులు వారధులు ఈ అవినీతి బాగోతం సాగుతోంది. కార్యాలయ అధికారులు వస్తుంటారు, బదిలీపై వెళ్తుంటారు, కానీ ఇక్కడ వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు మాత్రం శాశ్వతం. ఒక్కొక్కరు 15 నుంచి 20 ఏళ్ల దాకా రవాణా శాఖలో అనధికారికంగా ఉంటూ వసూళ్లను చక్కబెడుతున్నారు. రవాణా శాఖలో ప్రతి అధికారికి వాహన వెసులుబాటు కల్పించడంతో.. వాటికి డ్రైవర్లుగా తమకు కావలసిన ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారి ద్వారా అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
పేరుకే ఆన్‌లైన్.. ఆఫ్‌లైన్ ముడుపులే!
రవాణా శాఖలో వాహనాలకు సంబంధించిన సేవలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలకు అదనంగా ముట్టజెబితే కానీ పని జరగని పరిస్థితి. ఆఫీసులోనే ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వాహనదారుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కట్టిన చలానాల ద్వారానే కార్యాలయంలో పనులు చేయాలి. అయితే దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో (జిరాక్స్ కాపీలు) సమర్పించి ముడుపులు ముట్టజెబితే తప్ప పనులు కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల బండ్లు వెరిఫికేషన్ కోసం రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు మామూళ్లు దండుకుంటున్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. క్రూజర్లు, ఆటోరిక్షాలు, స్కూల్ బస్సులు, హెవీ గూడ్స్ వాహనాల వెరిఫికేషన్ తదితర సేవలకు కూడా వాహనదారులు ముడుపులు సమర్పించుకోవాల్సిందే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కార్యాలయ సిబ్బంది ప్రతి పనికి ‘అదనపు ధర’ నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఆర్‌టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై మరోసారి ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇవీ వసూళ్లు..
నాన్ ట్రాన్స్‌పోర్ట్ ట్రాన్సాక్షన్ అప్రూవల్‌కు మామూళ్లు ఇవ్వాల్సిందే.
ఇతర రాష్ట్రాల నుంచి ఎన్‌ఓసీపై వచ్చిన వాహనాల బదిలీకి, నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు బదిలీ చేయడానికి అదనం డబ్బు వసూలు చేస్తున్నారు.
కొత్త లారీలు రిజిస్ట్రేషన్‌కు సపరేటు ధర ఉంటుంది.
లారీలకు ఆలిండియా పర్మిట్ చలానాకు మామూళ్లు ఇవ్వాల్సిందే!
హెవీ ఎల్‌ఎల్‌ఆర్ ఎండార్స్‌మెంట్‌కు, షోరూమ్ నుంచి వచ్చిన ఓమ్నీ బస్సులను స్కూల్ బస్సులుగా మార్పు చేసేందుకు అధికంగా డబ్బు చెల్లించాల్సిందే!
అధికారులు చెప్పే మాటలు ఇవీ...
వాస్తవంలో జరుగుతోంది ఇలా..
ఏసీబీ అధికారులు హెచ్చరించినా కనిపించని మార్పు
రవాణా శాఖ కార్యాలయానికి నిత్యం వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. వందలో కనీసం ఐదారుగురు కూడా నేరుగా రావడం లేదు. ఒకవేళ ఎవరైనా నేరుగా వస్తే పలు కారణాలు చూపి అతని అర్జీని పరిశీలనలో పెట్టి వారం, పది రోజులు తిప్పుకుంటున్నారు. సమయం వృథాతో పాటు కార్యాలయంలో తలెత్తే ఇబ్బందిని చూసి దరఖాస్తుదారులు కూడా ఏజెంట్ల వద్దకు వెళ్తున్నారు. ఈ కార్యాలయంలో అధికారులు మారినా వారి తీరు మారడం లేదు. గతంలో ఏసీబీ అధికారులు కార్యాలయంతో పాటు ఆర్‌టీఏ చెక్‌పోస్టులో తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు అందించే సేవల్లో మార్పు రావాలని హెచ్చరించారు. అయినా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఒకరిద్దరు మినహా మిగతా అధికారులంతా కొత్తగా వచ్చారు. ప్రతి పనికి ఇక్కడ పైసలదే పైచేయి అవుతోంది. ‘అసలు ఫీజు’తో పాటు ‘కొసరు ఫీజు’ను కూడా వాహనదారులు చెల్లించుకోవాల్సి వస్తోంది.

అవినీతి కేంద్రం.. ఆర్టీఏ కార్యాలయం