పప్పు.. తప్పు ప్రకటన
కర్నూలు(సెంట్రల్): ఒక్కో కార్డుకు కేజీ కంది పప్పు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అధికారులు సైతం ఆదేశించారు. అయితే మంత్రి చెప్పిన మాటలు తప్పు అని తేలుతోంది. మూడు నెలల నుంచి జిల్లాకు బ్యాళ్ల కేటాయింపులే జరగడం లేదు. పేదలకు ఇచ్చే బియ్యం, చక్కెరలోనూ భారీ కోతలు విధించారు. గతంలో బియ్యానికి బదులుగా కార్డుకు రెండు, మూడు కేజీల చొప్పున జొన్నలు, రాగులు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా నిలిపి వేశారు. జిల్లాలో 6,34,631 మంది రేషన్ కార్డుదారులు ఉండగా.. ఒక్కో కార్డుకు కేజీ కంది పప్పు రూ.67 చొప్పున ఇవ్వాల్సి ఉంది. జిల్లాకు 600 టన్నుల బ్యాళ్లను ఇవ్వకపోవడంతో పంపిణీ చేయడం లేదు. బయటి మార్కెట్‌లో కిలో రూ.135పైగా ధరతో కొనుగోలు చేయలేక పేదలు పప్పన్నానికి దూరమవుతున్నారు.
● జిల్లాకు ఏప్రిల్ కోటాకు సంబంధించి బియ్యం కేటాయింపుల్లో 2,900 టన్నుల కోత పడింది. మార్చిలో 11,746 టన్నులు బియ్యం ఇవ్వగా ఏప్రిల్‌కు సంబంధించి 8,747 టన్నులు కేటాయించారు. ఫలితంగా ఏప్రిల్‌లో పేదలకు బియ్యం లేదనే చెప్పే అవకాశం ఉంది.
● ప్రతి కార్డుదారుడికి అర్ధకేజీ చక్కెర రూ.17.50 చొప్పున ఇవ్వాల్సి ఉంది. జిల్లాకు 350 టన్నుల అవసరం ఉండగా 200 టన్నులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.
బ్యాళ్ల సరఫరా ఉండదు
ఏప్రిల్ నెలలో రేషన్ కార్డు దారులకు బ్యాళ్లసరఫరా ఉండదు. బియ్యంలో సరఫరాలో ఇబ్బందులు ఉండవు. చక్కెర అందుబాటులో ఉంటుంది. జొన్నలు, రాగులు అస్సలు లేవు.
– ఎం.రాజారఘువీర్, డీఎస్‌ఓ, కర్నూలు
మూడు నెలల నుంచి
బ్యాళ్ల సరఫరా నిలుపుదల
నేటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ
పప్పు.. తప్పు ప్రకటన


