ఎన్నికలకు అదనపు నిధులు విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు అదనపు నిధులు విడుదల చేయండి

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

ఎన్నికలకు అదనపు నిధులు విడుదల చేయండి డీఆర్‌డీఎల్‌తో సిద్ధార్థ ఎంఓయూ నిత్యాన్నదానానికి విరాళం కృష్ణా వర్సిటీ ‘ఆక్వాటిక్స్‌’ జట్టు ఎంపిక

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గతంలో విడుదల చేసిన నిధులు కాకుండా ఈసారి 20 నుంచి 25 శాతం అదనంగా కేటాయించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్‌ చంద్ర పునీఠా.. కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే అధికారుల పారితోషికాలు పెంచడం, సీసీ టీవీల ఏర్పాటు, వెబ్‌కాస్టింగ్‌ వంటి అదనపు ఏర్పాట్ల నేపథ్యంలో మరిన్ని నిధులు అవసరమవుతున్నాయని వివరించారు. పంచాయతీ ఎన్నికలతో పాటు గుడివాడ, తాడిగడప మునిసి పాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు కలెక్టర్‌.. ఎస్‌ఈసీకి వివరించారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషనర్‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌ నిధుల విడుదల అనంతరం అదనపు నిధుల అవసరాలకు సంబంధించిన వివరాలను సేకరించిన తర్వాత కలెక్టర్ల ఖాతాలకు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నీవన్‌, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, డీపీవో ఎం.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీ హైదరాబాద్‌కు చెందిన భారత ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థ డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లేబొరేటరీ (డీఆర్‌డీఎల్‌)తో ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు గురువారం శాస్త్రవేత్త డాక్టర్‌ అంకతిరాజు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఆయన మాట్లాడుతూ కీలక పరిశోధనలు, క్షిపణి వ్యవస్థ రూపకల్పన, ఎరోడైనమాక్స్‌, నేవి గేషన్‌, గైడెన్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో డీఆర్‌డీఎల్‌ విశేష కృషి చేస్తోందన్నారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో డీఆర్‌డీల్‌ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పీఎం నరేంద్రమోదీ ఆశయాలకనుగుణంగా వికసిత్‌ భారత్‌–2047 సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డీఆర్‌డీఎల్‌ ఎంఓయూ చేసు కోవడంతో పరస్పర సహకారానికి నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఏర్పడతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఎల్‌ టెక్నాలజీ హెడ్‌ డాక్టర్‌ కృష్ణమోహన్‌, ప్రో ఉపకులపతి డాక్టర్‌ రత్నప్రసాద్‌, డీన్‌లు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు రూ.3.80 లక్షల విరాళాన్ని అందజేశారు. కానూరుకు చెందిన దాసరి రవికుమార్‌ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానం నిమిత్తం రూ. 3,80,111 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, కమిటీ చైర్మన్‌ రాధాకృష్ణ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణా విశ్వవిద్యాలయ అంతర కళాశాలల ఆక్వాటిక్స్‌ (పురుషుల – మహిళల) చాంపియన్‌షిప్‌, యూనివర్సిటీ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 19 తేదీ ఈడుపుగల్లులోని డీఎస్‌ఏ స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహిస్తున్నామని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, చాంపియన్‌షిప్‌ చైర్‌పర్సన్‌ కె.భాగ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితా, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ పాస్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలను చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్‌తో అటెస్ట్‌ చేయించి ఆ పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు పోటీలు జరిగే ప్రాంతానికి నేరుగా హాజరుకావాల్సిందిగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement