ఫిబ్రవరి 9 నుంచి గుణదల మాత ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 9 నుంచి గుణదల మాత ఉత్సవాలు

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

గుణదల(విజయవాడ తూర్పు): దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రెండవ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కతోలిక పీఠం బిషప్‌ తెలగతోటి రాజారావు ప్రకటించారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో గురువారం గుణదల మాత మహోత్సవాల కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. పోలీసు, వీఎంసీ, విద్యుత్‌ శాఖల అధికారులతో సమన్వయంగా ఉంటూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కమిటీకి దిశా నిర్దేశం చేశారు.

శతాబ్ది ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం

కథోలిక క్రైస్తవులు ఎదురు చూస్తున్న శతాబ్ది నూతన ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని.. ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గుణదల మాత పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆరేళ్లుగా నిర్మాణంలో ఉన్న నూతన చర్చిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మేరిమాత ఉత్సవాల నవదిన ప్రార్థనల్లో భాగంగా ఫిబ్రవరి 2న వైభవోపేతంగా నూతన ఆలయాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బిషప్‌లతో పాటు దేశ విదేశాల నుంచి కార్డినల్స్‌, ఆర్చ్‌ బిషప్‌లు, వేలాది మంది కతోలిక క్రైస్తవులు హాజరవుతారని తెలిపారు.

రేడియో ప్రసారాలు ప్రారంభం

మేరీమాత పుణ్యక్షేత్ర ఆవరణలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నూతన ఆలయ ప్రతిష్ఠాపన వంటి విశేషాలను శ్రోతలకు చేరవేసే దిశగా నూతనంగా రేడియో, వెబ్‌ సైట్‌ ప్రసారాలు ఏర్పాటు చేశామని రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు తెలిపారు. ఇప్పటికే ఐరోపా ఖండంలోని 86 దేశాల్లో 131 భాషల్లో రేడియో ప్రసారాల ద్వారా కథోలిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రైస్తవులకు చేరుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో మోన్సిగ్నోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌, వికార్‌ జనరల్‌ ఫాదర్‌ గాబ్రియేలు, ఫాదర్‌ కె.మరియన్న, ఫాదర్‌ చిన్నప్ప, ఫాదర్‌ మైఖేల్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement