డిజిటల్‌ చీటింగ్‌! | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ చీటింగ్‌!

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

● కృష్ణలంకకు చెందిన బి. ఫార్మసీ చదివే యువతికి ఒకరోజు స్నాప్‌షాట్‌ మెసేజ్‌ వచ్చింది. అనంతరం పరిచయం పెంచుకుని బిట్‌ కాయిన్‌లో పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చంటూ యువతిని నమ్మించారు. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి విడతల వారీగా రూ.28.75లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం స్పందించడం మానేశారు. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ● సిద్ధార్థ నగర్‌కు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌ డేటింగ్‌పై ఆసక్తి చూపాడు. దీంతో ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేశాడు. తన పూర్తి వివరాలు నమోదు చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాడు. అతను నమోదు చేసిన వివరాల ఆధారంగా తన మూడు బ్యాంకు ఖాతాల్లోని రూ.15లక్షలు బూచోళ్లు దోచేశారు. ● పంజా సెంటర్‌కు చెందిన ఒక వ్యక్తికి తాము చెప్పిన విధంగా ట్రేడింగ్‌ ఈక్విటీ, షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక మొత్తం లాభాలను పొందవచ్చని నమ్మించారు. అనంతరం విడతల వారీగా రూ.16.63లక్షలు పెట్టుబడి పెట్టించి దోచేశారు. ప్రజలు అవగాహన పెంచుకోవాలి

సోషల్‌ మీడియా

వేదికగా నేరాలు..

సైబర్‌ నేరం.. రోజుకో రకం

సోషల్‌ మీడియానే అస్త్రంగా వాడుతున్న నేరగాళ్లు

విద్యావంతులే అధికశాతం బాధితులు

అన్ని వర్గాల ప్రజలపైనా దాడులు

రుణాలు, అధిక లాభాల పేరిట వల

ఇటీవల సైబర్‌ క్రైం స్టేషన్‌కు క్యూ కడుతున్న బాధితులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయంటూ రోజుకో కొత్త వేషంతో ప్రజలను నమ్మిస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్‌ నేరాల్లో 80 శాతం సోషల్‌ మీడియా వేదికగానే జరుగుతుండగా, అనధికారిక యాప్స్‌ డౌన్‌లోడ్‌ వంటి వాటితో మరికొన్ని నేరాలు జరుగుతున్నాయి. టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన సైబర్‌ నేరగాళ్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ నంబర్‌తో ఆపరేట్‌ అయ్యే బ్యాంకు ఖాతాలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులోని సొమ్మును దోచేస్తున్నారు. ఇప్పుడు సైబర్‌ నేరాలు పోలీసులకు సైతం పెనుసవాల్‌గా మారాయి. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా, ఏదో రూపంలో నేరగాళ్లు దోచేస్తూనే ఉన్నారు.

ఇవే నిదర్శనం..

ఇలా ముగ్గురే కాదు ఇటీవల కాలంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాటి పట్ల ఆసక్తి చూపిన వారిని అడ్డంగా దోచేస్తున్నారు. పోలీసులకు సైతం సైబర్‌ నేరగాళ్లు సవాల్‌గా మారారు.

ప్రజలు గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చిన లింక్‌లు, ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్‌ చేయకుండా డిలీట్‌ చేయాలి. సోషల్‌ మీడియాతోనే 80శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాను అవసరం మేరకు మాత్రం వాడాలి. జాబ్స్‌ ఇప్పిస్తామని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాల అంటూ వచ్చే ప్రకటనలు నమ్మటం సరికాదు. అనధికారిక యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసే సమయంలో అప్రమత్తంగా లేకుంటే ఫోన్‌లోని సమాచారం అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళుతుంది. ఓటీపీలు కూడా వారికి చేరతాయి. ఏదైనా సైబర్‌నేరం జరిగితే వెంటనే 1930కి కాల్‌ చేయడం ద్వారా మీ డబ్బులు ఏ అకౌంట్‌కు వెళ్లాయో గుర్తించి, అకౌంట్‌ లావాదేవీలు నిలిపివేయవచ్చు.

– కె. కృష్ణప్రసన్న, డీసీపీ, సైబర్‌ క్రైమ్‌, విజయవాడ

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా వేదికగా 80శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే ఆసక్తికరమైన ప్రకటనలతో ప్రజలు మోసం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలు అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల పేర్లతో పోస్టులు వస్తున్నాయని, ఇంటి వద్దే ఉంటూ ఆదాయం పొంద వచ్చని, తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభం పొందవచ్చంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా అనాథరైజ్డ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. వారి నుంచి వచ్చే మెసేజ్‌లను సమగ్రంగా చదివిన తర్వాత సబ్‌మిట్‌ కొట్టాలంటున్నారు. లేకుండా మీకు వచ్చే ఓటీపీలు, సైబర్‌ నేరగాళ్లకు వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement