కోనేరుసెంటర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 కార్యక్రమంలో భాగంగా యూత్ పార్లమెంట్ పోటీలు–2027 నిర్వహణకు కృష్ణాజిల్లాలో ఏర్పాట్లు చేపట్టారు. ఈ పోటీల్లో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల దాదాపు 50 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోటీలకు ముందు విద్యార్థులను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి పోటీల్లో పాల్గొనడమే విద్యార్థి దశలో ఒక గొప్ప అభ్యాస అనుభవమన్నారు. పుస్తకాలు, విద్యా సంబంధిత అంశాల ద్వారా పొందే అకడమిక్ పరిజ్ఞానం మాత్రమే నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలను సాధించేందుకు సరిపోదని, దానికి అనుబంధంగా క్షేత్రస్థాయి అనుభవం, ఆచరణాత్మక పరిజ్ఞానం, వివిధ అంశాలపై అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. యూత్ పార్లమెంట్ పోటీల్లో పాల్గొనే దాదాపు 50 మంది విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కె. రాంజీ, రిజిస్ట్రార్ డాక్టర్ ఉషా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


