ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

ఆజాద్‌ సేవలు చిరస్మరణీయం

చిలకలపూడి(మచిలీపట్నం): భారతరత్న, భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో కె. శ్రీధర్‌ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్‌ రబ్బాని, డీటీడబ్ల్యూవో ఫణిధూర్జటి, కలెక్టరేట్‌ ఏవో రాధిక తదితరులు ఉన్నారు.

పీహెచ్‌సీల్లో సేవల పరిశీలన

లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా కంచికచర్ల, అల్లూరు, వీరులపాడు పీహెచ్‌సీలతో పాటు పెద్దాపురం ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం, ఓపీ రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రతి వైద్యాధికారి స్వయంగా ఓపీ రిజిస్టర్‌లో రోగుల వివరాలను, ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. లేబొరేటరీని పరిశీలించి, ప్రతిరోజు సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని, రోగులకు సత్వరం రిపోర్టులు అందించాలన్నారు. ఫార్మసీలో మందుల లభ్యత, పంపిణీ విధానం, అత్యవసర మందుల నిల్వలను, వాచ్‌ రిజిస్టర్‌ నందు నమోదు చేస్తున్నదీ లేనిదీ పరిశీలించారు.

ముగిసిన రీసెర్చ్‌ కమిటీ సమావేశం

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రీసెర్చ్‌ కమిటీ సమావేశం బుధవారం ముగిసింది. యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు రీసెర్చ్‌ స్కాలర్‌షిప్స్‌ కోసం చేసుకున్న 1622 దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించారు. వీటితోపాటు ఫ్యాకల్టీ రీసెర్చ్‌ గ్రాంట్ల కింద చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు, పీహెచ్‌డీ పరిశోధకులు సమర్పించిన ఆరు నెలల పురోగతి నివేదికలను సమీక్షించారు. పరిశోధనల పురోగతి, విద్యా ప్రాధాన్యం, పరిశోధన నాణ్యత, అనుబంధ కళాశాలల్లో పరిశోధన కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ టి. సాయిసుధీర్‌, రీసెర్చ్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మీసూర్యప్రభ, పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధ, పరిశోధనా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల గుర్తింపు

ఎర్రుపాలెం: భూముల రీసర్వేలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులను గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని కేశిరెడ్డిపల్లి, ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరం, పెద్దాపురం గ్రామాల సమీపాన రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేశారు. ఖమ్మం, ఎన్టీఆర్‌ జిల్లాల అధికారులు ధర్మారావు, సాంబశివరావు రికార్డుల ఆధారంగా సరిహద్దులు నిర్ణయించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె. సునీత ఎలిజబెత్‌, రెండు మండలాల ఉద్యోగులు రవికుమార్‌, రాజశేఖర్‌, బాలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement