కోనేరుసెంటర్: జనగణన–2027 రెండో దశకు సంబంధించి భారత జనగణన కార్యకలాపాల ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జనగణన–2027 రెండో దశ జనాభా గణన ప్రక్రియ నిర్వహణలో భాగంగా అధికారులకు కృష్ణా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బుధవారం శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు.
వారిది కీలక బాధ్యతలు..
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బందిపై కీలక బాధ్యత ఉందన్నారు. ఈ శిక్షణలో అందించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకుని, జనగణనకు సంబంధించిన విధివిధానాలు, సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి సంబంధించిన జనాభా వివరాల సేకరణలో కచ్చితత్వం, పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానం పాటించేలా సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. జనగణన అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన జాతీయ కార్యక్రమమని, దీనికి సంబంధించిన ప్రతి దశను నిర్దేశిత కాలపరిమితిలో, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, జనగణన–2027 రెండో దశ జనాభా గణనను కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా జనగణన అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా అటవీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయ గణాంక అధికారి, ఎన్‌ఐసీ జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి పాల్గొన్నారు.
అధికారుల సమావేశంలో
కలెక్టర్ డీకే బాలాజీ


