తుపాను ప్రభావంతో మారిన వాతావరణం జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా మోస్తరు వర్షం నేడు భారీ వర్షాలు ఆందోళనలో అన్నదాతలు
మురసు ప్రభావంతో నేడు భారీవర్షాలు
కంకిపాడు/చిలకలపూడి: అర్నబ్ తుపాను ధాటికి జిల్లా అంతటా చిగురుటాకులా వణికింది. అపార నష్టం వాటిల్లింది. ఆ గాయం నుంచి ఇంకా జిల్లా ప్రజలు కోలుకోనే లేదు. అప్పుడు మురసు రూపంలో మరో తుపాను గండం జిల్లాకు పొంచి ఉంది. దీంతో ప్రజల వెన్నులో వణుకు మొదలైంది.
వాతావరణంలో మార్పులు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మురసు తుపానుగా మారడంతో సోమవారం ఉదయం నుంచే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్మేసింది. ఉదయం నుంచే అక్కడక్కడా మోస్తరు వర్షం పడుతోంది. జిల్లాలో 3.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కృత్తివెన్ను, బంటుమిల్లి ప్రాంతాల్లో 9.2 మిల్లీమీటర్లు, కోడూరులో 9 మిల్లీమీటర్ల్ల వర్షపాతం నమోదైంది. 26 మండలాలకు చల్లపల్లి మినహా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తీవ్రమైన చలి గాలులు వీస్తుండటంతో తుపాను ప్రభావం మొదలైందంటూ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పంట చేతికందేనా?
జిల్లా వ్యాప్తంగా 1.61 లక్షల హెక్టార్లలో వరి, 18,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా వరి పంట మరో 20 రోజుల్లో చేతికి అందనుంది. గింజ గట్టిపడే దశలో, పొట్ట దశలో పైరు ఉంది. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతికి అందుతుందని భావిస్తున్న తరుణంలో ఇటీవలే అర్నబ్ తుపాను రూపంలో రైతన్నల ఆశలను చిదిమింది. 34,864 హెక్టార్లలో వరి, 358 హెక్టార్లలో మినుము, 23 హెక్టార్లలో వేరుశనగ, మూడు హెక్టార్లలో నువ్వులు, 25 హెక్టార్లలో చెరకు పంటకు నష్టం వాటిల్లింది. కోతకు చేరుతున్న వరి పంట పూర్తిగా నేలవాలి కంకులు నీటిలో నానుతున్నాయి. మానుగాయ, కంకులు మొలకెత్తి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఉద్యాన పంటలు 1350 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది.
అన్నదాతల్లో ఆవేదన
మురసు తుపాను విరుచుకుపడనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన అధికమైంది. మొన్న తుపాను నుంచే ఇంకా రైతులు కోలుకోలేదు. మళ్లీ తుపాను రానుండటంతో పంట చేతికి దక్కే పరిస్థితి లేదని వాపోతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులు వర్షార్పణమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
మురసు తుపాను కారణంగా భారీ వర్షాలు నమోదుకానున్న అధికారుల సూచనలతో కలెక్టర్ డీకె బాలాజీ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మునిగిపోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మురసు ప్రభావంతో మంగళవారం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంగోలు సమీపంలో తుపాను తీరం దాటనుందని అధికారులు తెలిపారు. ఆ ప్రభావం జిల్లాపై పడనుంది. భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.


