పామర్రు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పామర్రులోని ఎస్‌కేఆర్‌ఆర్ జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి, సోషల్ వెల్ఫేర్ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న విధానాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి పామర్రుకు సంబంధించిన బూత్‌లో మొత్తం 175 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా పారదర్శకంగా సాగడంపై ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పత్రాలను పక్కాగా సీల్ చేసి భద్ర పరచాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి జి.రవికాంత్, ఎన్నికల సహాయకులు సిబ్బంది పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు చైనాలోని జింగ్‌షాన్‌లో జరిగిన ప్రపంచ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్– 2026లో పాల్గొని డబుల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన నగరానికి చెందిన క్రీడాకారిణి ఏఎస్ వైశాలిని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) కె.కోటేశ్వరరావు అభినందించారు. ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయంలో వైశాలిని సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వైశాలి సాధించిన విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తి దాయకమని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వైశాలి సాధించాలని ఆకాంక్షించారు. శాప్ సిబ్బంది, కోచ్‌లు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): వాతావరణశాఖ నివేదికల ప్రకారం మురసు తుపాను దృష్ట్యా భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈ నెల 3వ తేదీ మంగళవారం అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవు ప్రకటించారని డీఈవో యూవీ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పర్యావరణ పరిరక్షణతో పాటు సహజ వనరుల సమర్థ వినియోగం కోసం ప్రతి ఒక్కరూ సుస్థిర జీవనశైలి అలవర్చుకోవాలని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక ఏపీసీపీడీసీఎల్ కార్పోరేట్ కార్యాలయంలో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా ప్రచార కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ వరకు సర్కిల్ పరిధిలో పర్యావరణహిత జీవనశైలి, విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంధన సామర్థ్యం కలిగిన విద్యుత్ పరికరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయవచ్చని చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డెరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎం, ఉద్యోగులు హాజరై పర్యావరణహితంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు.


