ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పి.కృష్ణయ్య
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సహజ వనరులను విచ్చిలవిడిగా వినియోగించడంతో భవిష్యత్తులో పర్యావరణ సంక్షోభం తీవ్రంగా ఉంటుందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పి.కృష్ణయ్య చెప్పారు. సహజవనరులను పరిమితంగానే వినియోగించాలని, మన అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడంతో శక్తి (ఎనర్జీ) ఆదా జరగాలన్నారు. స్థానిక మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతికశాస్త్ర విభాగం, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సిద్ధార్థ కళాశాల ఆవరణలోని వెబినార్ హాలులో సోమవారం సేవ్ ఎనర్జీ పేరుతో అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథి కృష్ణయ్య మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం తర్వాత సహజ వనరుల వినియోగంలో విచ్చలవిడితనం పెరిగిం దని, భూగర్భజలాలు అడుగంటాయని చెప్పారు. 33 శాతం ఉండాల్సిన అడవులు దేశంలో 23 శాతమే ఉన్నాయన్నారు.
విద్యుత్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలి
కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ మాట్లాడుతూ శక్తి ఆదాలో భాగంగా వాడకంలో లేనప్పుడు విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేయాలన్నారు. ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ 11 దేశాల బ్రిక్స్ కూటమి ప్రపంచ సమస్యలపై ఒక్కటయ్యాయని, అందులో సేవ్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ ఒకటన్నారు. సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, రెడ్యూస్ వేస్ట్ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జూనియర్ రీసెర్చ్ స్కాలర్ ఫాతిమా మాట్లాడుతూ వరితో పోల్చితే నీటిని తక్కువగా గ్రహించే మిల్లెట్స్ వారానికి ఒకసారి రైస్‌కి ప్రత్యామ్నాయ ఆహారంగా తీసుకోవాలన్నారు. కళాశాల ఫిజిక్స్ విభాగాధిపతి టి.శ్రీనివాసకృష్ణ, సీనియర్ అధ్యాపకులు జె.పాండురంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణహిత సంచులను విద్యార్థులకు అందజే పర్యావరణ హితానికి కృషి చేస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.


