విజయవాడ లీగల్/ పెనమలూరు: జ్యుడీషియల్ సర్వీసెస్‌లో ప్రవేశించాలంటే ఏకాగ్రత, స్వీయ ఆలోచనా శక్తి ఎంతో అవసరమని హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ అన్నారు. ఎస్‌వీడీ సిద్ధార్థ స్కూల్ ఆఫ్ లా, ఏపీ లా అకాడమీ సంయుక్తంగా జూనియర్ న్యాయవాదులకు ‘న్యాయసేవలోకి ప్రవేశించడం ఎలా’ అనే అంశంపై సోమవారం పెనమలూరు మండలం కానూరులోని సిద్ధార్థ లా కళాశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించాయి. జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ గతంలో విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే శక్తి, విషయ పరిజ్ఞానాన్ని గుర్తుంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికీ సెల్‌ఫోన్లపై ఆధారపడే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష హాల్లో సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదు కనుక విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి, స్వీయ ఆలోచనా సామర్థ్యం, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే పరీక్షల్లోనూ జీవితంలోనూ విజయం సాధించగలరని హితవు పలికారు. అకాడమీ అధ్యక్షుడు ఏకే బాషా, కార్యదర్శి కోనేరు సీతారామయ్య, కాలేజీ డీన్ సీహెచ్ దివాకర్‌బాబు, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ సభ్యుడు కె.చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్ తదితరులు మాట్లాడారు.


