ఎవరి లెక్కలు వారివి.. | - | Sakshi
Sakshi News home page

ఎవరి లెక్కలు వారివి..

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

● పెడన మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపును పట్టణంలోని పల్లోటి హైస్కూల్‌లో నిర్వహించనున్నారు. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపునకు 32, చైర్మన్‌ అభ్యర్థి ఓట్ల లెక్కింపునకు 32 టేబుళ్లు సిద్ధం చేశారు. ఉయ్యూరు మునిసిపాలిటీకి.. ఏజీ అండ్‌ ఎస్‌జీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చైర్మన్‌ అభ్యర్థికి 32, కౌన్సిలర్‌ అభ్యర్థులకు 32 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

మచిలీపట్నం కార్పొరేషన్‌, పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి కౌంటింగ్‌ కేంద్రాల్లో సర్వం సిద్ధం గెలుపుపై అభ్యర్థుల్లో ధీమా

వేర్వేరుగా బ్యాలెట్ల విభజన.. ఆపై లెక్కింపు

చిలకలపూడి (మచిలీపట్నం): మునిసిపల్‌ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్‌, కార్పొరేటర్‌ స్థానాలతో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల చైర్మన్‌, కౌన్సిలర్‌ స్థానాలకు జరిగిన పోలైన ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు ప్రాంతాల్లోనూ కౌంటింగ్‌ ప్రక్రియకు అవసరమైన టేబుళ్లు, సిబ్బందిని సిద్ధం చేశారు. మరోవైపు గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా, ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు 161 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 1,39,246 మంది ఓటర్లకు గాను 98,627 మంది ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెడన మునిసిపాలిటీలో 28 వార్డులకు సంబంధించి 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 25,373 మంది ఓటర్లకు గాను 20,151 మంది ఓటేశారు. ఉయ్యూరు మునిసిపాలిటీలో 32 వార్డులకు 48 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 32,793 మంది ఓటర్లకు గాను 24,979 మంది బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను పటిష్ట భద్రత నడుమ ఆయా స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించి భద్రపరిచారు.

కౌంటింగ్‌ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు

మచిలీపట్నం నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపును మండల పరిధిలోని రుద్రవరంలో ఉన్న కృష్ణా యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఇందుకోసం మేయర్‌ అభ్యర్థి ఓట్ల లెక్కింపునకు 84 టేబుళ్లు, 60 డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపునకు మరో 84 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ఫలితాలపై ఉత్కంఠ

ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన అభ్యర్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్‌ సరళి, తమకు వచ్చిన ఓట్లు, ప్రత్యర్థుల బలాబలాలపై రాజకీయ పార్టీలు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నాయి. కౌంటింగ్‌ ముగిసిన వెంటనే మేయర్‌, చైర్మన్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాల్లో విజేతలు ఎవరో స్పష్టత రానుంది. దీంతో మంగళవారం వెలువడనున్న ఫలితాలపై మూడు ప్రాంతాల్లోనూ రాజకీయ ఆసక్తి నెలకొంది.

కౌంటింగ్‌ కేంద్రాల్లో స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సులను అధికారుల సమక్షంలో తెరిచి, మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను వేర్వేరుగా విభజించనున్నారు. అనంతరం వాటిని సంబంధిత కౌంటింగ్‌ టేబుళ్లకు పంపించి లెక్కిస్తారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు చెందిన 161 పోలింగ్‌ కేంద్రాల బ్యాలెట్‌ బాక్సుల ఓట్లను కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా లెక్కించనున్నారు. ప్రతి 25 బ్యాలెట్‌ పత్రాలను ఒక కట్టగా కట్టి, వాటి ఆధారంగా లెక్కింపు చేపట్టనున్నట్లు రిటర్నింగ్‌ అధికారులు వెల్లడించారు. ఇదే విధానంలో పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల్లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement