గన్నవరం: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన సమాచారం ప్రకారం.. మండలంలోని కేసరపల్లి శివారు వీఎన్ పురం కాలనీకి చెందిన గజగంటి కోటేశ్వరరావు(42) ఓ ప్రైవేటు కంపెనీ గోదాములో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అప్పుల బాధతో తీవ్ర ఆందోళన చెందుతున్న అతను మద్యానికి బానిసయ్యాడు. దీనికితోడు అనారోగ్య సమస్యలతో కోటేశ్వరరావు ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి న్యూఆటోనగర్లో హౌస్ కీపింగ్ పనిచేస్తున్న అతని భార్య అనూష ఇంటికి వచ్చి చూడగా ఇనుపరాడ్డుకు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ ఉండడం గమనించింది. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


