శ్రీలలితాత్రిపుర సుందరీగా భక్తులను కరుణించిన దుర్గమ్మ పలు ఆలయాల నుంచి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ రూ.75 లక్షల కిరీటం సమర్పించిన శ్రీకాకుళానికి చెందిన భక్తులు యథేచ్ఛగా కొనసాగిన వీఐపీ దర్శనాలు సామాన్య భక్తుల దర్శనానికి మూడు గంటలకు పైనే సమయం
కనుల పండువగా నగరోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ గురువారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్యరూపిణిగా చెరకు గడ చేబూనిన అమ్మవారు భక్తులను కరుణించారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మను భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు.
బ్రేక్ లేని వీఐపీ దర్శనాలు
తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల రద్దీ ఏకరీతిగా కొనసాగింది. వీఐపీలు, సిఫార్సులు ఉన్న వారు ఘాట్ రోడ్డు మీద దర్జాగా కొండపైకి వెళ్లి అర్ధగంటలో దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుంటే.. క్యూలైన్లో ఉన్న భక్తుల దర్శనానికి మూడు గంటలకు పైగానే సమయం పట్టింది. దీంతో క్యూలైన్లో చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడ్డారు. వీఐపీలకు ప్రత్యేక టైం స్లాట్ కేటాయించినా అమలు కాలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యథేచ్ఛగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు దర్శనాలు కొనసాగాయి. రూ.1000 టికెట్ల విక్ర యాలు నిలిపివేసినా, వీఐపీ దర్శనాలకు విచ్చేస్తుండటంతో క్యూలైన్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు వారిని నిలదీయడం కనిపించింది. లక్ష్మీగణపతి విగ్రహం వద్ద, ఫుట్బ్రిడ్జి సమీపంలో భక్తులు గుమిగూడి ఉండటంతో దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆలయ అధికారులు, పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం గేట్లకు తాళాలు వేసి వాటిని తన వద్దే పెట్టుకున్నారు.
శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలు
దసరా ఉత్సవాల నేపథ్యంలో దుర్గమ్మకు శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలు సమ ర్పించారు. శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు, అన్నవరం దేవస్థాన ఈఓ చక్రధరరావు, ఆయా ఆలయాల అర్చకులు, వేద పండితులు పట్టువస్త్రాలను సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దుర్గగుడి ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ వారికి సాదరంగా స్వాగతం పలికారు.
5 రోజుల్లో 7 లక్షల మందికి దర్శనం
దసరా ఉత్సవాల్లో ఐదు రోజుల్లో ఏడు లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. సుమారు 72 వేల మందికి అన్న ప్రసాదం అందజేశామని, 8.80 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈఓ వెల్లడించారు.
నేడు శ్రీసరస్వతీదేవి అలంకారం
మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. శుక్రవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీసరస్వతీదేవిగా భక్తులకుదర్శనమిస్తారు. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి. సరస్వతి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.
ఐదో రోజు ఆదాయం రూ.29.83 లక్షలు
ఉత్సవాల్లో ఐదో రోజు గురువారం రూ.29.83 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. సింగిల్ లడ్డూ విక్రయం ద్వారా రూ.1.17 లక్షలు, ఆరు లడ్డూల బాక్సుల ద్వారా రూ.17 లక్షలు, మూడు లడ్డూల బాక్సుల విక్రయం ద్వారా రూ.1.30 లక్షలు, శ్రీచక్ర పెద్ద లడ్డూ విక్రయం ద్వారా రూ.10 లక్షల మేర ఆదాయం సమకూరిందని వివరించారు. ఇక కేశఖండనశాలలో తలనీలాల టికెట్ల ద్వారా రూ.28,680 ఆదాయం లభించిందని పేర్కొన్నారు.
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరానికి చెందిన డ్రగ్స్ విక్రేత బషీర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పటమటలోని హైస్కూల్ రోడ్డుకు చెందిన నాగసౌమ్య బెంగళూర్ నుంచి నగరానికి మత్తు పదార్థాలు తీసుకొస్తూ రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడింది. ఆ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. నాగసౌమ్య డ్రగ్స్ విక్రేత బషీర్ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సత్యనారాయణపురం పోలీసులు బషీర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
దసరా ఉత్సవాల్లో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిత్యం నగరోత్సవ సేవ నిర్వహిస్తున్నారు. గురువారం ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, భక్తజనుల కోలాట నృత్యాల నడుమ ఈ నగరోత్సవం కనుల పండువగా సాగింది. ఉత్సవాలను పురస్కరించుకుని కొండపై కొలువైన ఆదిదంపతులు తమ మధ్యకు రావడంతో భక్తులు తన్మయం చెందుతున్నారు.


