వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటనతో పార్టీ కార్యకర్తల్లో జోష్ బందరు మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి కొండపల్లి, ఉయ్యూరు చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపిక
మచిలీపట్నంటౌన్: మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇప్పటికే మచిలీపట్నం మేయర్, కొండపల్లి, ఉయ్యూరు చైర్పర్సన్ అభ్యర్థులను పార్టీ ప్రకటించడంతో జోష్ మరింత పెరిగింది. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి పేరును పార్టీ అధిష్టానం గురువారం రాత్రి ఖరారు చేసింది. జ్యోతి మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు సతీమణి కావడం గమనార్హం. 1975 డిసెంబర్ 14వ తేదీన జన్మించిన లంకా జ్యోతి నగరంలోని రుస్తుంబాద మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆమె మామయ్య లంక అచ్చయ్య నాయుడు 1981లో పేర్ని కృష్ణ మూర్తితో కలసి సహచర మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. ఆ తర్వాత అచ్చయ్య నాయుడు కుమారుడు సూరిబాబు రాజకీయాల్లోకి వచ్చి 1995లో బందరు మండలం అరిసేపల్లి పీఏసీఎస్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2000లో కౌన్సిలర్‌గా, 2005లో మున్సిపల్ కో– ఆప్షన్ సభ్యుడిగా, 2014లో కౌన్సిలర్‌గా, 2021లో కార్పొరేషన్ డెప్యూటీ మేయర్‌గా పని చేశారు. లంకా సూరిబాబు, జ్యోతి వివాహం 1990లో జరిగింది. వీరికి కుమార్తె మౌనిక, కుమారుడు క్రాంతి కుమార్ ఉన్నారు. మౌనికకు వివాహం కాగా, క్రాంతి కుమార్ డిగ్రీ పూర్తి చేశాడు. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతిని పేర్ని నాని సూచన మేరకు వైఎస్సార్ సీపీ అధిష్టానం ఖరారు చేసింది. వైఎస్సార్ సీపీకి సాధారణంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అండగా ఉంటాయని, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతికి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతారని, ఆమె విజయం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మేయర్ అభ్యర్థిగా ఖరారైన జ్యోతి, ఆమె భర్త సూరిబాబుకు పలువురు అభినందనలు తెలిపారు.
కొండపల్లి చైర్పర్సన్ అభ్యర్థిగా తేజస్వి
ఇబ్రహీంపట్నం: కొండపల్లి మునిసిపాలిటీ వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా నల్లమోతు తేజస్వి పేరును పార్టీ అధిష్టానం గురువారం అధికారికంగా ప్రకటించింది. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన 47 ఏళ్ల నల్లమోతు తేజస్వి 2024లో గొల్లపూడి ఏఎంసీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆమెది ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. తేజస్వి భర్త నల్లమోతు ప్రకాశరావు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆమె కుమార్తె నల్లమోతు ప్రియాంక 2021 మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ సూచనలతో పార్టీ అధిష్టానం తేజస్వి పేరును ప్రకటించింది. ఈ నెల 18వ తేదీన అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉయ్యూరు చైర్పర్సన్ అభ్యర్థిగా దివ్య
ఉయ్యూరు(కంకిపాడు): ఉయ్యూరు మునిసిపల్ వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఉయ్యూరు పట్టణానికి చెందిన పైడిముక్కల దివ్యను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల విడుదలైన మునిసిపాలిటీ గజిట్ నోటిఫికేషన్లో ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎస్సీకి రిజర్వు అయ్యింది. ఈ స్థానానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పర్యవేక్షణలో పార్టీ మునిసిపల్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం చైతన్య సతీమణి పైడిముక్కల దివ్యను ఖరారు చేశారు. 1994 మే 31వ తేదీన జన్మించిన దివ్య బీటెక్ డిగ్రీ పొందారు. మునిసిపాలిటీ పరిధిలోని 32 వార్డుల అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేయనున్నారు. అధికార టీడీపీ, కూటమి కుయుక్తులను తిప్పికొట్టేలా ఉయ్యూరు మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు వైఎస్సార్ సీపీ అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది.
ఉయ్యూరు చైర్పర్సన్ అభ్యర్థి పైడిముక్కల దివ్య
కొండపల్లి చైర్పర్సన్ అభ్యర్థి నల్లమోతు తేజస్వి


