వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ మేయర్ టికెట్ రాధా పార్టీ మార్పుపై జనసైనికులు ఆగ్రహం అదేదో టీడీపీ నుంచే పోటీ చేయొచ్చని సూచన తమ సీటు ఇవ్వడం ఏమిటంటూ ఆగ్రహం మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల కినుక
డివిజన్లపై కుదరని అంగీకారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమిలో విజయవాడ మేయర్ పదవి చిచ్చు రగిలించింది. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో మేయర్ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే చివరికి ఆ పదవిని జనసేన పార్టీకి ఇవ్వడానికి అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేయడం తెలిసిందే. జనసేన తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరోజు ముందు జనసేన కండువా కప్పుకొన్న వంగవీటి రాధాకృష్ణకు సీటు కేటాయించడం ఇటు జనసేన, అటు టీడీపీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి తెరలేపింది.
నైరాశ్యంలో ఆశావహులు
రాజధానికి దగ్గరలో ఉన్న కీలకమైన విజయవాడను తమ చేతుల్లో ఉంచుకోవాలని తెలుగుదేశం కేడర్ మొదటి నుంచి ఆశించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుడు సిద్ధార్థ్, దేవి నేని చందూ, గద్దె అనురాధ, బొప్పన భవకుమార్, చెన్నుపాటి గాంధీ, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు పలువురు మేయర్ పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు. వారిని కాదని ఈ సీటు జనసేనకు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గుచూపింది. అయితే అక్కడ కూడా తమ పార్టీ అభ్యర్థినే రంగంలోకి దింపేలా పావులు కదిపింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ ఇస్తామని ఊరిస్తూ వచ్చిన వంగవీటి రాధాను జనసేనలోకి పంపి అక్కడి నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావించింది. ఈ పరిణామాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఎమ్మెల్యే బొండా ఉమాను ముందుపెట్టి..
అధికార పార్టీకి చెందిన సామాజిక వర్గం వారు మేయర్ సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీని కోసం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమాను రెచ్చగొడుతున్నారు. కాపు సామాజికవర్గం నేతలతో బొండా ఉమా చర్చలు జరుపుతున్నారు. తన కుమారుడికి సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. లేనిపక్షంలో కాపు నేతలను రెచ్చ గొట్టడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి సీటు హామీ పొందేందుకు ఆయన తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వంగవీటి రాధాకు సీటు ఇంకా సీటు ఖరారు కాలేదన్న ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు రాధాకు నిలకడ లేదని, ఇప్పటికే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం పార్టీల్లో పనిచేసి ఇప్పుడు పదవి కోసం జనసేనలో చేరారంటూ కూటమి నేతలు సోషల్ మీడియాలో తమ వారితో ప్రచారం చేయిస్తున్నారు. మరో వైపు జనసేన పార్టీలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తమ పార్టీకి సీటు కేటాయించామని చెబుతూ తెలుగుదేశంలో నుంచి తీసుకొచ్చిన రాధాకు సీటు ఇవ్వడమేంటని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ సీటు టీడీపీ వారే తీసుకుని రాధాకృష్ణకు ఇచ్చి ఉంటే బాగుండేదని, తమకు వేరే చోట ఇవ్వాల్సిందని వాదిస్తున్నారు.
విజయవాడ కార్పొరేషన్, తిరువూరు, పెడన మునిసిపాలిటీలు జనసేనకు కేటాయించి, మిగిలిన చోట్ల టీడీపీ పోటీ చేసేలా పొత్తు కుదిరింది. కార్పొరేటర్ల సీట్ల విషయంలో కూటమి ఇంకా అంగీకారానికి రాలేదు. జనసేనకు పది సీట్లు, బీజేపీకి మూడు నియోజకవర్గాల్లో ఒక్కో సీటు చొప్పున ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ నుంచి బేరం మొదలుపెట్టారు. అయితే జనసేన వారు తమకు ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది సీట్లు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పింది. మరోవైపు బీజేపీ కూడా తమకు పది స్థానాలకు తగ్గకుండా కావాలని, పశ్చిమంలో ఎక్కువ స్థానాలు ఇవ్వాలని పట్టుపట్టింది. ఈ చర్చల్లో కూటమి నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, బొండా ఉమా, అమ్మిశెట్టి వాసు, అబ్బూరు శ్రీరామ్ పాల్గొన్నారు.


