చిలకలపూడి(మచిలీపట్నం): చంద్రబాబు ప్రభుత్వ అహంకారపూరిత కుట్రలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడుతున్నాయని, వీటిని ప్రజలు గమనించా లని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటిస్తూ కలెక్టర్ బుధవారం విడుదల చేసిన గెజిట్లో పెనమలూరు మండలంలో జరిగిన రిజర్వేషన్లలో అవకతవకలపై విస్మయం వ్యక్తంచేశారు. ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వు చేసి, ఎంపీటీసీ స్థానాలేవీ కేటాయించలేదని విమర్శించారు. ఈ అవకతవకలపై కలెక్టర్ డి.కె.బాలాజీకి గురువారం పేర్ని నాని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెనమలూరు ఎంపీపీ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వు చేసి, ఎంపీటీసీ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా వారికి కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ నిర్వహించామని, అన్ రిజర్వు స్థానంలో పోటీ చేయొచ్చు కదా అని కలెక్టర్ చెప్పడం దారుణమన్నారు. అవకతవకలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించారు. పేర్ని నాని వెంట వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, గణేశన రమేష్, సాక్షి ఫణి తదితరులు ఉన్నారు.


