వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): శరన్నవరాత్రి ఉత్సవాల వేళ శ్రీకాకుళం పట్టణానికి చెందిన కుటుంబం గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా సమర్పించింది. రూ.75 లక్షలతో ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సుందరంగా తయారు చేయించిన 494 గ్రాముల బరువు గల నవరత్న కచిత బంగారు కిరీటాన్ని శ్రీకాకుళానికి చెందిన భక్తుడు కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె.దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి సమర్పించారు. ఆలయ ఈఓ కె.శీనానాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీ సర్ వి.త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అనంతరం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గమ్మ దయవల్లే తాము ఈ కానుకను సమర్పించుకోగలిగామన్నారు. పవిత్ర శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం సమర్పించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు.
గన్నవరం రూరల్: నైపుణ్య అభివృద్ధి, సామర్థ్యాల మెరుగుదల లక్ష్యాలుగా పోటీలు నిర్వహించినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. మండలంలోని కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎస్టీఆర్ఎఫ్ దక్షిణ, దక్షిణ మధ్య జోన్ ప్రాంతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో తమిళనాడు ఎస్డీఆర్ఎఫ్ విజేతగా నిలిచింది. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ నెల 12 నుంచి 15 వరకూ నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళం, ఒడిశా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమం గురువారం జరగ్గా ఐజీ పోలీస్ ఆపరేషన్స్ సీహెచ్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమాండెంట్ ప్రసన్నకుమార్, కల్నల్ పి.ఎన్. రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం మునిసిపల్ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాల్టీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభిస్తామన్నారు. ముందుగా ఆయా మునిసిపాల్టీల్లో విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం ఆయా డివిజన్లు, వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వివరించారు. 21వ తేదీన బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. 28వ తేదీన పోలింగ్, 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు ఏ ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేయాలో సంబంధిత కమిషనర్లను ఇప్పటికే పత్రికా ముఖంగా తెలపాలని ఆదేశించామన్నారు. నామినేషన్ల ప్రక్రియ నిర్ణీత సమయంలో దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని స్పష్టంచే శారు. ఈ మునిసిపాల్టీలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేశామ న్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి కె.జయరావు పాల్గొన్నారు.


