న్యూస్‌రీల్
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన యువత, విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, పలు నియోజకవర్గాల ఇన్‌చార్జులు
నాడు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్
సందుసందులో పేకాట శిబిరం
ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా?
డెలివరీ బాయ్‌లుగా యువత
అవకతవకలను బయటకు తీస్తాం
బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యారంగ, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విద్యార్థులు, యువజనులు కదం తొక్కారు. నీట్ అవకతవకలపై ఢిల్లీలో జెన్ జీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఆందోళనల తరహాలో మచి లీపట్నం నగరాన్ని నిరసనలతో హోరెత్తించారు. వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వ ర్యంలో మంగళవారం భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత లక్ష్మీటాకీస్ సెంటర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌కు చేరుకున్నారు. యువత, విద్యార్థులు ప్లకార్డులు చేబూని దగా డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలతో హోరెత్తించారు.
నిిస్సిగ్గుగా టీచర్ పోస్టులను అమ్ముకున్నారు
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో నిస్సిగ్గుగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీచర్ పోస్టులను అమ్ముకున్నారని మాజీ మంత్రి, వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ధర్నా చౌక్ వద్ద ఆయన మాట్లాడారు. దగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తే సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. డీఎస్సీపై చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్‌కు ఆయన అమ్మమ్మ లక్ష్మీ పార్వతి స్పందించి వస్తే పారిపోయారని విమర్శించారు. తాను చర్చకు వస్తానన్నా ఇంత వరకు సమాధానం చెప్పలేదని పేర్కొ న్నారు. నీట్ పేపరు లీకేజీపై ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై నీతి, నిజాయితీ ఉంటే నారా లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగాన్ని పార దోలుతామని యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు సందుసందులో పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) విమర్శించారు. సంక్రాంతి కోడిపందేలు, జూదాలు నిర్వహించటమే జాబ్‌క్యాలెండర్‌గా భావించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సచివాలయాలు ఏర్పాటు చేసి 1.50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రాలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే డీఎస్సీలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామన్నారు.
చదువుతోనే పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎటువంటి బకా యిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించారని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము తెలిపారు. నాడు – నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎన్ని సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఇంత వరకు విద్యార్థులు, యువత కోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా అని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవభక్తుని చక్రవర్తి ప్రశ్నించారు. ప్రతి విద్యార్థీ ఉన్నత చదువులను అభ్యసించాలని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి మహానుభావుడని పేర్కొన్నారు. లక్షల మంది విద్యార్థులకు మేలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని వివరించారు.
నిరుద్యోగులు ఉద్యోగాలు లేక జోమాటా, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌లుగా మారుతున్నా రని వైఎస్సార్ సీపీ స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు చేయా ల్సింది పోయి తమ మందీ మార్బలం, కాంట్రాక్టర్లను కూటమి పాలకులు బాగు చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నా మని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని పేర్కొన్నారు.
తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, ఇప్పటి దగా డీఎస్సీలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మేరుగుమాల కాళేశ్వరరావు అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని అన్నారు.


