ఇంటర్, డిగ్రీ విద్యార్థుల భవితతో ప్రభుత్వం చెలగాటం 75 మంది జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి బదిలీపై పంపించి తిరిగి జూనియర్ కళాశాలలకు రావాలని ఆదేశాలు తరచూ మారుతున్న ఉత్తర్వులతో బోధనపై ప్రతికూల ప్రభావం
మచిలీపట్నంఅర్బన్: చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు జూనియర్, డిగ్రీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక ముందే జూనియర్ కళాశాలల్లో బోధిస్తున్న లెక్చరర్లకు ఉద్యోగోన్నతులు కల్పించి డిగ్రీ లెక్చరర్లుగా పోస్టింగ్‌లు ఇచ్చింది. వారంతా 15 రోజుల్లోగా బదిలీ అయిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు కొనసాగుతున్న సమయంలో అధ్యాపకులను డిగ్రీ కళాశాలలకు తరలించడంతో జూనియర్ కళాశాలల్లో బోధన దెబ్బతింటోందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయా లెక్చరర్లు అందరినీ తిరిగి పాత స్థానాలకు వచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
75 మందికి బదిలీలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా జోన్–2కు చెందిన 75 మంది జూనియర్ లెక్చరర్లు ఉద్యోగోన్నతి పొందారు. రాష్ట్రంలోని నాలుగు జోన్లలో జోన్–4 తర్వాత అత్యధికంగా జోన్–2లోనే ఉద్యోగోన్నతులు కల్పించారు. జోన్–2 పరిధిలోని ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 75 మంది అధ్యాపకులు డిగ్రీ కళాశాలలకు బదిలీ అయ్యారు. ఫలితంగా ఇంటర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఏర్పడింది. సబ్జెక్టుల వారీగా చూస్తే కామర్స్‌లో 11 మంది, తెలుగు 9, ఎకనామిక్స్ 8, ఇంగ్లిష్ 8, ఫిజిక్స్ 7, పొలిటికల్ సైన్స్ 6, జువాలజీ 5, కెమిస్ట్రీ 5, హిస్టరీ 5, హిందీ 4, బోటనీ 3, లైబ్రేరియన్లు 3, మ్యాథమెటిక్స్‌లో ఒకరు ఉద్యోగోన్నతి పొందారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, తమిళం, ఫిజికల్ డైరెక్టర్ విభాగాల్లో ఒక్కరికి కూడా ప్రమోషన్ దక్కలేదు. ఈ బదిలీలతో ప్రధాన సబ్జెక్టుల్లో అధ్యాపకుల కొరత మరింత పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
భిన్న ఉత్తర్వులతో గందరగోళం
తొలుత జూనియర్ లెక్చరర్లకు డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించి అక్కడ విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం మరో ఉత్తర్వు జారీచేసి, ఉద్యోగోన్నతి పొందిన వారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాము పని చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ‘ఆన్ డ్యూటీ’ ప్రాతిపదికన విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు వారిని రిలీవ్ చేసి జూనియర్ కళాశాలలకు పంపాలని, అక్కడి ప్రిన్సిపాళ్లు హాజరు ధ్రువీకరణ పత్రాలు పంపగా, వేతనాలు మాత్రం డిగ్రీ కళాశాలల నుంచే చెల్లించాలని ఆదేశించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే పరస్పర భిన్నమైన ఉత్తర్వులు రావడంతో అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
బోధనపై ప్రతికూల ప్రభావం
ముందుగా జూనియర్ కళాశాలల్లో ఏర్పడే అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అనంతరమే ఉద్యోగోన్నతులు కల్పిస్తే సమస్య ఉండేది కాదు. అలాకాకుండా డిగ్రీ కాలేజీలకు అధ్యాపకులను బదిలీచేసింది. జూనియర్ కళాశాలల్లో ఖాళీలు ఏర్పడి బోధన దెబ్బతింటుందని గుర్తించి పాత స్థానాల్లో విధులు నిర్వహించాలని వారికి సూచించింది. భవిష్యత్తులో వారిని తిరిగి డిగ్రీ కళాశాలలకు పంపితే, ఇంటర్ విద్యార్థుల పరి స్థితి ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లోనూ ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి. అక్కడ అధ్యాపకుల కొరతను ఎలా భర్తీ చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్పష్టత ఇవ్వాల్సిందే..
డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తికాకముందే ఇంటర్ కళాశాలల నుంచి అధ్యాపకులను తరలించడం, అనంతరం మళ్లీ జూనియర్ కళాశాలల్లోనే బోధించా లని ఆదేశించడం ప్రభుత్వ నిర్ణయాల్లో స్థిరత్వం లోపించిందనే విమర్శలకు కారణమైంది. ఒకవైపు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఏర్పడిన అధ్యాపకుల కొరతను భర్తీ చేసే చర్యలు చేపట్టకుండా, ఉన్న అధ్యాపకులనే అటూ ఇటూ తిప్పడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగోన్నతులు, పోస్టింగ్‌లు, బోధనా బాధ్యతలపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని విద్యార్థులు, తల్లి దండ్రులు, అధ్యాపక సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.


