ఇంద్రకీలాద్రికి హరిత శోభ | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రికి హరిత శోభ

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

పండ్లు, కూరగాయలే ఆభరణాలుగా దుర్గమ్మ దర్శనం నేడు పూర్ణాహుతితోశాకంబరీ ఉత్సవాల ముగింపు

నేడు ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘వరి కంకుల మధ్య మా దుర్గమ్మా.. నిను చూచిన కనులదే భాగ్యం కదమ్మా..’ అంటూ భక్తులు పులకించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు అంగరంగ వైభ వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు వరి కంకులనే ఆభరణాలుగా తీర్చిదిద్దారు. ముగ్ధ మనోహరమైన అమ్మవారి రూపాన్ని చూసిన భక్తులు మైమరిచారు. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి శాకంబరీగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని కరివేపాకు తోటగా మలిచిన తీరు అందరికీ ముగ్ధులను చేసింది. మరో వైపు ఆషాఢ మాసోత్సవం నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారి దర్శనంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా నివేదన అనంతరం రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో అన్ని క్యూలైన్లలోనూ భక్తులను ఉచి తంగా అనుమతించారు. రూ.500 టికెట్ల విక్రయా లను నిలిపివేసిన దేవస్థాన అధికారులు బంగారు వాకిలి ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9.30 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా కనిపించింది.

ఆకట్టుకున్న ప్రధాన ఆలయ అలంకరణ

శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ వారి ప్రధాన ఆలయానికి చేసిన కూరగాయల అలంకరణ భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. కరివేపాకు, వంకాయలు, దొండ, బెండ, కాకర, టమాట, క్యారెట్‌, క్యాప్సికమ్‌లతో ఆలయ ప్రాంగణాన్ని హరిత వనంగా తీర్చిదిద్దారు. ఇక ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఆకుకూరలు, కాయ గూరలతో విశేషంగా అలంకరించారు.

వేద విద్యార్థులకు దివ్య దర్శనం

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థులకు ఇకపై అమ్మవారి దివ్య దర్శనం కలగనుంది. ఈ మేరకు మంగళవారం పోరంకి వేద పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. ఈ నూతన పాలసీకి ఆలయ ఈఓ శీనానాయక్‌ సోమ వారం ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి పండుగ దినాలు, పౌర్ణమి, అమావాస్య వంటి విశేష రోజుల్లో అమ్మవారి దర్శనం కల్పించడం చాలా ఆనందంగా ఉందని వేద విద్యార్థులు పేర్కొన్నారు.

నేడు పూర్ణాహుతి

సోమవారం ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు బుధవారం ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో సప్తశతీ పారాయణం, మహా విద్యా పారాయణం, హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, మంటప పూజలను నిర్వహిస్తారు. అనంతరం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. అమ్మవారి ఆలయ ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావు నగర్‌, చిట్టినగర్‌, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement