గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలో ‘శ్రీనివాస మంగాపురం’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఆదివారం అప్సర థియేటర్‌లో సూపర్‌స్టార్ కృష్ణ మనువడు జయకృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ట్రైలర్ విడుదల జరిగింది. కథానాయకుడు జయకృష్ణ, కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్ర నిర్మాత జెమిని కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ తన తాత సూపర్‌స్టార్ కృష్ణ తనకు దేవుడిలాంటి వారని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తన బాబాయ్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలో, షూటింగ్ సమయంలో ఎంతో మద్దతుగా నిలిచారన్నారు. త్వరలోనే ప్రీ–రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ’శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్‌ను విజయవాడ వేదికగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. హీరో, హీరోయిన ఇద్దరూ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారన్నారు. సినిమా అన్ని వర్గాలను అభిమానిస్తుందని తెలిపారు. తొలుత లెనిన్ సెంటర్లో కృష్ణ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీరం బుజ్జి, సుధా స్వామి తదితరులు పాల్గొన్నారు.


