బాబు హయాంలో లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ చేపట్టాలి
భోలేబాబా, హెరిటేజ్ సంబంధాలపై శాసనమండలిలో చర్చించాలి ఫ్లైట్ టికెట్లు, మ్యాచ్ టికెట్లు ఏ అకౌంట్ నుంచి కొన్నారు? ఎన్ని స్పెషల్ ఫ్లైట్లకు ఎంత చెల్లించారో లోకేశ్ జవాబివ్వాలి నిత్యం వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే బాబుపై కేసు నమోదు చేయగలరా? పయ్యావుల కేశవ్‌ను ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని మార్కెట్‌లో కిలో నెయ్యి రూ.650కు దొరుకుతుంటే రూ.658కు ఎలా కొంటున్నారు చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌కు సూటి ప్రశ్నలు
చిలకలపూడి(మచిలీపట్నం): 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి ఇప్పటి వరకు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించే ధైర్యం సీఎం చంద్రబాబుకు ఉందా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. బందరులోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయిస్తే నిజాలు నిగ్గు తేలతాయన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ ఈ వ్యవహారంలో నిజాయితీపరులైతే శాసనమండలిలో ఎందుకు చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పాత్రికేయుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ పుష్ప సినిమా డైలాగుల మాదిరి ‘ఫ్లైట్ టిక్కెట్టు నాదే, మ్యాచ్ టిక్కెట్టు నాదే’ అని ట్వీట్ చేయటంపై పేర్ని నాని స్పందిస్తూ పుష్ప సినిమాలో హీరో కూలీ అని, నారా లోకేశ్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు కూలీ అని ఫ్లైట్ టికెట్టు, మ్యాచ్ టికెట్టు కొన్న వివరాలు, బోర్డింగ్ పాస్‌ల వివరాలు, దుడ్లు ఏ అకౌంట్ నుంచి చెల్లించారో ఆధారాలు ట్విట్టర్‌లో పెట్టగలరా? అని నిలదీశారు. రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రి అయిన లోకేశ్ ఇప్పటి వరకు ఎన్ని స్పెషల్‌ౖ ఫ్లెట్లలో తిరిగారు? ఎంత మొత్తం ఏ అకౌంట్ ద్వారా చెల్లించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బాబుపై ఎన్ని కేసులు పెట్టాలో
అప్పుల మంత్రి కేశవ్ చెప్పాలి
శాసనమండలిలో వైఎస్సార్ సీపీ సభ్యులు చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి చిత్రపటాలతో సభలోకి వచ్చారని, దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారని ఓ విలేకరి ప్రశ్నించగా, పేర్ని నాని సమాధానం చెబుతూ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు అప్పులు తేవటం కోసం సంతకాలు పెట్టి, పెట్టి మైండ్ బ్లాక్ అయినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘అప్పుల మంత్రి కేశవ్ గారూ నిత్యం వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలో చెప్పగలరా?’ అని వేంకటేశ్వస్వామి చిత్రపటం పట్టుకుని చంద్రబాబు బూట్లతో వెళ్తున్న ఫొటో చూపించి ప్రశ్నించారు. నెయ్యి రవాణా కంపెనీలతో హెరిటేజ్‌కు ఎన్నో అక్రమ సంబంధాలు ఉన్నాయని విమర్శించారు.
ప్రసాదం అంశాన్ని బజారుకీడ్చిందెవరో!
అసలు భోలేబాబా డెయిరీకి, హెరిటేజ్‌కు సంబంధం లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, శాసనమండలిలో ప్రైవేటు కంపెనీపై ఎందుకు చర్చ జరపాలని అంటున్న టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ సలహాదారుగా ఉన్న కుటుంబరావు హెరిటేజ్ సంస్థపై ఎందుకు వివరణ ఇచ్చారో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఎవరినైనా మేనేజ్ చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అయితే వేంకటేశ్వరస్వామిని మేనేజ్ చేయలేక ఆయన పాపం బద్ధలైందని, ఆ స్వామే కక్ష తీర్చుకున్నారని పేర్కొన్నారు. భోలే బాబా సంస్థతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న టీడీపీ నాయకులు ఆ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న వైష్ణవి కంపెనీ యాజమాన్యం ద్వారా వెనక్కి పంపిన నాలుగు లారీల నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎలా అనుమతించారని సూటిగా ప్రశ్నించారు. ఆ నెయ్యితోనే లడ్డూ ప్రసాదాన్ని చేసి భక్తులకు పంచలేదా అని నిలదీశారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.650కు నెయ్యి దొరుకుతుంటే, రూ.658కు ఎలా కొనుగోలు చేస్తున్నారో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ జవాబివ్వాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


