ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించాలి

Feb 21 2026 8:05 AM | Updated on Feb 21 2026 8:05 AM

ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించాలి

ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని విరమించాలి

ఆర్టీసీ కనుమరుగే..

ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు

భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్‌ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ డిపోల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యాధరపురం డిపో వద్ద ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్సు ముద్దు.. ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సులు వద్దు, ప్రయాణికుల భద్రత – భరోసా ఆర్టీసీతోనే సాధ్యం, పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఆర్టీసీని కాపాడుకుందాం’ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర డెప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎం.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. మొదటి విడతగా 750 విద్యుత్‌ బస్సుల నిర్వహణ కోసం 12 డిపోలను మూసివేస్తే రెండో దశలో మరిన్ని బస్సులు వస్తే మిగిలిన డిపోలు, ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 2029 నాటికి విద్యుత్‌ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్‌ 88ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు డీజిల్‌, సీఎన్‌జీ బస్సులను నడిపిన తాము విద్యుత్‌ బస్సులను నడపలేమా అని ప్రశ్నించారు. సీ్త్ర–శక్తి పథకం విజయవంతం కావాలంటే మరో మూడు వేల బస్సులు, పది వేల మంది ఉద్యోగులు కావాలన్నారు. ప్రైవేట్‌ ఆపరేటర్ల ద్వారా విద్యుత్‌ బస్సులను నడపాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు.

రాష్ట్ర డిపోల మెయింటినెన్స్‌ కన్వీనర్‌ ఎన్‌.హెచ్‌. చక్రవర్తి మాట్లాడుతూ.. కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించటాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. హైఎండ్‌ బస్సులను నైపుణ్యంతో సమర్థంగా నడిపిన ఉద్యోగుల స్థానంలో ప్రైవేట్‌ ఆపరేటర్లను తీసుకురావడం ద్వారా ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీని ప్రైవేట్‌కు అప్పగిస్తే ఇకపై చరిత్రలోనే సంస్థ ఉంటుందన్నారు. ఈయూ ఎన్టీఆర్‌ జిల్లా సెక్రటరీ జి.ఎం.రావు మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న విద్యాధరపురం డిపోను ఖాళీ చేయించి ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సుల నిర్వహణ కోసం అప్పగించటం దారుణమన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు 0.2 శాతంగా ఉంటే ప్రైవేట్‌ బస్సుల ద్వారా జరిగినవి ఆరు శాతానికిపైగా ఉన్నాయని వివరించారు. ఈయూ విద్యాధరపురం డిపో సెక్రటరీ, ప్రెసిడెంట్లు ఎల్‌ఎల్‌ రాజు, కె.అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ 1990లో ఏర్పడిన ఈ డిపో ఉద్యోగులంతా ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నా మని తెలిపారు. ఈ పరిస్థితిలో డిపోను మూసివేసి ఇక్కడి ఉద్యోగులను వేర్వేరు డిపోలకు కేటాయించడం బాధాకరంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement