ప్రత్యేక ఉప కారాగారం సందర్శన
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సభ్యులు శుక్రవారం మచిలీపట్నం ప్రత్యేక ఉపకారాగారాన్ని సంద ర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తదితరుల కేసు నేపథ్యంగా దేశవ్యాప్తంగా జైళ్ల స్థితిగతులు, ముద్దాయిలకు అందుతున్న సదుపాయాలు, వసతులు, కుల, మత సంబంధిత వివక్ష అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి.రామకృష్ణయ్య, బోర్డు సభ్యులైన రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్.పోతురాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి.యుగంధర్, పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎ.రమణరావు, డీవైఈఓ బి.ఎస్.సి. శేఖర్ సింగ్, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి ఎస్‌కే షాహిద్ బాబు, జిల్లా ఉపాధి అధికారి బ్రహ్మం, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.పద్మావతి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఖైదీలతో అధికారులు నేరుగా మాట్లాడి జైలులో అందుతున్న వసతులు, ఆహారం, శుభ్రత, వైద్య సేవలు, న్యాయ సహాయం వంటి అంశాలపై ఆరా తీశారు. సబ్ జైలులో ఖైదీలందరూ మంచి పరివర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ చీలి ముసలయ్య, జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, డెప్యూటీ జైలర్ టి.మాలిబాబు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.


