దీవించమ్మా.. దుర్గమ్మ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ ఆశీస్సుల కోసం విద్యార్థులు శుక్రవారం ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులు, యాత్రికులు, నూతన వధూవరులతో అమ్మ వారి ఆలయంలో పండుగ వాతావరణం కనిపించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. పోటీ పరీక్షలు, వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లతో అమ్మవారిని దర్శించుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేలా దీవించు తల్లీ అంటూ వేడుకున్నారు. కనక దుర్గమ్మ అమ్మ వారి దర్శనం కోసం తరలివచ్చిన విద్యార్థులు, భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం కల్పించారు.


