డాక్టర్ దీపిక మృతిపై డీఎంఈ ఆరా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్థీషియా పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పద మృతిపై రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రఘునందన్‌రావు ఆరా తీశారు. ఆయన బుధవారం వైద్య కళాశాలకు వచ్చి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ రోజు జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు, ఆమె క్యాన్నులా పెట్టించుకున్న విషయం డీఎంఈకి వివరించారు. ఆమె మృతికి గల కారణాలను సహచర విద్యార్థులు కానీ, స్టాఫ్ కానీ చెప్పలేక పోతున్నట్లు ఆయన డీఎంఈకి తెలియజేశారు. విచారణలో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా ఉన్న అంశాన్ని వివరించారు.
అసిస్టెంట్‌పై ఆరా..
కాగా ఆ రోజు మృతురాలు డాక్టర్ దీపిక అసిస్టెంట్ ప్రొఫెసర్ రూమ్‌లో క్యాన్నులా పెట్టించుకుని ఇంజెక్షన్ చేయించుకుంది. అసిస్టెంట్ ఆ సమయంలో విధుల్లో లేకుండా ఎక్కడికి వెళ్లిందనే అంశాన్ని కూడా డీఎంఈ లేవనెత్తినట్లు తెలిసింది. ఆమె ఇంటి కెళ్లిపోయినట్లు ఇప్పటికే ‘సాక్షి’లో కథనం రావడంతో ఆ అంశాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. డాక్టర్ దీపిక విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని నింపడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం ఎన్జీవో హోంలో విద్యాసాగర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా ఉద్యోగుల కృషి, నాయకత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా విభాగం చైర్‌పర్సన్ వి.నిర్మలా కుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 4, 5, 6 తేదీలలో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆయా తేదీలలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియం, ఏపీ ఎన్జీవో హోం నందు నిర్వహించే కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుడివాడ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలో పెద్ద వీధికి చెందిన పి.మాధురి(30) గత కొంతకాలంగా మునిసిపల్ పార్కు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తుండగా భర్త తాపీ పని చేస్తూ ఇద్దరు కుమారులతో కలసి జీవిస్తున్నారు. గత 27వ తేదీన మాధురి ఆస్పత్రిలో ఉద్యోగం మానేసిందని, రెండు రోజుల నుంచి ఇంట్లో ఒక్కతే ఒంటరిగా ఉంటోందని స్థానికులు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతసేపటికి ఇంటి పక్కన వారు వచ్చి చూడగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి వెంటనే పరిసర ప్రాంతాల్లోని వారికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, వన్‌టౌన్–2 ఎస్‌ఐ కుమార్‌రాజాలు సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తల్లి గట్టు దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా వన్‌టౌన్ ఎస్‌ఐ–2 కుమార్‌రాజా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


