అంకెల గారడీతో అన్ని వర్గాలకూ టోపీ | - | Sakshi
Sakshi News home page

అంకెల గారడీతో అన్ని వర్గాలకూ టోపీ

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

అంకెల గారడీతో అన్ని వర్గాలకూ టోపీ

అంకెల గారడీతో అన్ని వర్గాలకూ టోపీ

ప్రజాధనం దుర్వినియోగం..

రాష్ట్ర బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని విశ్రాంత ఐఏఎస్‌ డాక్టర్‌ పీవీ రమేష్‌ అన్నారు. బుధవారం విజయవాడలోని దాసరి భవన్‌లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సమావేశంలో పీవీ రమేష్‌ మాట్లాడుతూ బడ్జెట్‌లో పేర్కొన్న కేటాయింపులకు వాస్తవిక వ్యయాలకు పొంతన ఉండటం లేదన్నారు. బడ్జెట్‌ ప్రజల సంక్షేమం, అభివృద్ధిలను పూర్తిగా విస్మరించిందన్నారు. పదేళ్లుగా కేవలం 5 శాతం మాత్రమే రాష్ట్ర ఆదాయం పెరుగుతూ రూ.88వేల కోట్లకు చేరిదని.. నేటి బడ్జెట్‌లో పేర్కొనట్లు రూ. 1.25వేల కోట్లకు ఎలా చేరుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు. బడ్జెట్‌లో మరో లక్ష కోట్ల రూపాయల రుణాలను ఈ ఏడాది పొందాలని పేర్కొనడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3శాతానికి మించి అప్పులు చేయరాదని 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ స్పష్టం చేసిందన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

ప్రజలకు ప్రయోజనం లేదు..

వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు కోట్లాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే అరకొరగా ఉన్నాయన్నారు. సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే విధంగా బడ్జెట్‌ రూప కల్పన జరగలేదని విమర్శించారు. అంకెల గారడీతో రూపొందించిన బడ్జెట్‌లో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.

వ్యవసాయానికి ప్రాధాన్యం లేదు..

మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమ్మిళత వృద్ధికి, అసమానతల తగ్గింపునకు తోడ్పడే విధంగా లేదన్నారు. 60 శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం దక్కలేదన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వి. లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి. రాంభూపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సభ్యుడు నరహరశెట్టి నరసింహారావు, దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపకుడు వినయ్‌ కుమార్‌, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల నిధి, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వృద్ధాప్య పెన్షన్‌ అందిస్తామని హామీ ఇచ్చిందని, నేడు బడ్జెట్‌లో వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఆయా వర్గాలను మోసం చేసిందన్నారు. ఆర్భాటమైన ప్రచారాలతో వివిధ రకాల ఈవెంట్లతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 10 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 4వేల కోట్లు కేటాయించలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement