21న పోరంకిలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

21న పోరంకిలో జాబ్‌మేళా

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 3:32 PM

పెనమలూరు: పోరంకిలో ఈ నెల 21వ తేదీన జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో వివరాలు తెలుపుతూ పెనమలూరు నియోజకవర్గ పరిధి పోరంకి 100 అడుగుల రోడ్డులో ఉన్న శ్రీ కృష్ణ వేణి డిగ్రీ కాలేజీలో ఉదయం 9గంటలకు మేళా నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో 16 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ, ఇంజినీరింగ్‌ వరకు చదువుతున్న వారు 18 నుంచి 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జాబ్‌మేళాకు వచ్చే వారు ఆధార్‌ కార్డు, బయోడేటా, పాన్‌, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు తప్పని సరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 7981368429, 8885159008, 9676708041లో సంప్రదించాలని ఆయన సూచించారు.

నేటి నుంచి సాంఘిక నాటకోత్సవాలు

విజయవాడ కల్చరల్‌: ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి, శ్రీ కృష్ణ తెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కృష్ణా తెలుగు థియేటర్‌ ఆర్ట్స్‌ గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ కేవీకే రంగనాథం తెలిపారు. సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. శ్రీ కృష్ణ ఆర్ట్స్‌ థియేటర్‌ 26వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. సమావేశంలో కోశాధికారి చంద్రశేఖర్‌, సహకార్యదర్శి శ్రీకృష్ణా ఆర్ట్స్‌ థియేటర్స్‌ హరి రవిశంకర్‌, సహకార్యదర్శి మక్కపాటి అవంతి తదితరులు పాల్గొన్నారు.

సుబాబుల్‌ కర్రలు పడి యువకుడు మృతి

వత్సవాయి: సుబాబుల్‌ కర్రల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడు మరణించిన సంఘటన బుధవారం వత్సవాయి వేమవరం రహదారిలో చోటుచేసుకుంది. వివరాలు.. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామానికి చెందిన కొందరు కూలీలు సుబాబుల్‌ కొట్టేందుకు వత్సవాయి వచ్చారు. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో సుబాబుల్‌ లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌పై డ్రైవర్‌ పక్కన్న ముప్పాళ్ల పండు(18) కూర్చొన్నాడు. ఈ క్రమంలో వేమవరం రహదారిపై ఓ గుంతలో ట్రాక్టర్‌ దిగడంతో కుదుపు ఏర్పడి డ్రైవర్‌ పక్కన కూర్చున్న పండు కిందపడిపోయాడు. అదే సమయంలో ట్రాక్టర్‌ పై లోడ్‌ చేసి ఉన్న సుబాబుల్‌ కర్రలు కూడా అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పదో తరగతి పూర్తి చేసిన పండు కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనులకు వెళ్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి, ఓ సోదరి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పతికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement