డీపీవో అరుణకు ఉద్యోగోన్నతి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పంచా యతీ అధికారి జె. అరుణకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో నంబరు 13ను విడుదల చేశారు. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. అయితే ఏ జిల్లాలో విధులు కేటాయించిందీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులతో పాటు డీపీవో కార్యాలయ సిబ్బంది అరుణకు అభినందనలు తెలిపారు.
పాఠశాలల్లో డీఈఓ తనిఖీలు
రెడ్డిగూడెం: మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ, బాలయోగి గురుకుల కళాశాలలను, రెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100రోజుల కార్యక్రమం గురించి అడిగి తెలుసుకుని, 10వ తరగతి విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎంఈవో రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నిరుద్యోగ యవతకు వెబ్ డెవలపర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారధి ఓ ప్రకటనలో తెలిపారు. తమ కళాశాల ఆవరణలోని స్కిల్ హబ్‌లో ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని, డిప్లొమా, ఇంటర్మీడియెట్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ శిక్షణ తరగతులకు హాజరు కావడానికి అర్హులని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రధాన మంత్రి కౌశల్ వికాసయోజన స్కీమ్ ద్వారా సర్టిఫికెట్‌తో పాటుగా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23వ తేదీలోగా విజయవాడ రమేష్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 99857 59304, 63050 04318లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
డీపీవో అరుణకు ఉద్యోగోన్నతి


