పరిశ్రమల స్థాపనపై యువత దృష్టి పెట్టాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న యువతీ యువకులు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని పరిశ్రమలు స్థాపనపై దృష్టి పెట్టాలని జిల్లా పరిశ్రమల శాఖ ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ పి.మనీషా చెప్పారు. స్థానిక రావిచెట్టు సెంటర్‌లోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయం ఆవరణలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్స్‌పై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈ సందర్బంగా మనీషా మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న వారు పరిశ్రమలను స్థాపించడం ద్వారా మరికొంత మందికి ఉపాధికి కల్పించవచ్చని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన పూర్తి సమాచారాన్ని తాము అందజేస్తామని, పరిశ్రమల స్థాపనకు ముఖ్యమైన పెట్టుబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తున్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన ద్వారా సులభంగా బ్యాంకుల నుంచి రుణాలను పొందవచ్చని చెప్పారు. ఆ రుణాలను పొందడానికి ఉద్యమ్ కార్డు తప్పనిసరి అని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న చాలా మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఇండస్ట్రీయల్ ప్రమోషనల్ ఆఫీసర్ ఆర్.రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని యువత అభివృద్ధి చెందడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావచ్చునని అన్నారు. జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ, శిక్షణ పొందుతున్న మహిళలు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


