శుభాల వసంతం.. రంజాన్‌కు సంసిద్ధం | - | Sakshi
Sakshi News home page

శుభాల వసంతం.. రంజాన్‌కు సంసిద్ధం

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

శుభాల

శుభాల వసంతం.. రంజాన్‌కు సంసిద్ధం

రేపటి నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబు జిల్లా వ్యాప్తంగా హలీమ్‌ దుకాణాల ఏర్పాటు

హలీమ్‌ రుచులు సిద్ధం..

పవిత్ర మాసం..

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సర్వశుభాలను అందించే రంజాన్‌ మాస ప్రార్థనలకు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మసీదు ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయి. ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎన్నోరెట్ల ఫలితాలను అందిస్తుందని వారి విశ్వాసం. భగవత్‌ ఆశీస్సులు అందించే రంజాన్‌ కోసం ముస్లింలు సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. పవిత్ర రంజాన్‌ మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలపొడుపు కనిపించడంతో రంజాన్‌ మాసం ప్రారంభమవుతుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. గురువారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముందని వారు వివరించారు.

ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు..

రోజా (ఉపవాస దీక్ష) పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యమిస్తారు. నమాజ్‌ కోసం ఉమ్మడి జిల్లాలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యోదయానికి ముందు (సహర్‌) నుంచి సూర్యాస్తమయం (ఇఫ్తార్‌) వరకూ ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాస దీక్షలో రోజుకు ఐదుపూటలా నమాజు చేస్తారు. దీనికి అదనంగా ‘తరావిహ్‌’ నమాజ్‌ను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకూ సాగే తరావీహ్‌ నమాజులో ఖురాన్‌ పఠనం చేస్తారు.

ఖురాన్‌ అవతరించిన మాసం..

రంజాన్‌ మాసాన్ని దివ్య ఖురాన్‌ భూమిపై అవతరించిన మాసంగా భావిస్తారు. ఈ నెల మొత్తం ముస్లింలు భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ఈ నెలలో ’సఫిల్‌’ చదివితే ’ఫరజ్‌’ చదివినంతగా.. అంటే 70 సార్లు నమాజ్‌ చేసిన పుణ్యం వస్తుందని ఇస్లాం గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.

దానధర్మాలకు ప్రాధాన్యం..

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలు దానధర్మాలకు (జకాత్‌, ఫిత్రాకు) ప్రాధాన్యమిస్తారు. ఈ నెల రోజుల్లో చేసిన దానాలు 70 రెట్లు అధిక ఫలితాన్ని అందిస్తాయని వారి నమ్మకం. ఈ మాసంలోని తాక్‌రాత్‌ రోజులకు ప్రత్యేకత ఉంది. ఈ నెల రోజులు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి అభాగ్యులకు దానాలు చేస్తూ ఇతోధిక సాయాన్ని అందిస్తారు. ప్రతి ముస్లిం ఫిత్రా (నిర్ణీత దానం) తప్పనిసరిగా చేయాలి.

మొదలైన సందడి..

విజయవాడలో వంద సంవత్సరాలకు పూర్వమే మసీదులను ఏర్పాటు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. నగరంలోని సరాయి మసీదు, జుమ్మా మసీదుకు రంజాన్‌ మాసంలో రోజూ వందల సంఖ్యలో ముస్లింలు హాజరై సామూహిక నమాజ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారాల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. రంజాన్‌ మాసం సందర్భంగా మసీదులను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

రంజాన్‌ మాసం నెల రోజులూ లభించే ఒక ప్రత్యేక వంటకం హలీమ్‌. కొన్నేళ్ల క్రితం వరకూ హైదరాబాద్‌ వరకే పరిమితమైన హలీమ్‌.. దశాబ్ద కాలంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని పట్టణాలకు విస్తరించింది. విజయవాడలోని వించిపేట, ఇస్లాంపేట, భవానీపురం, అరండల్‌పేట తదితర ప్రాంతా ల్లో హలీమ్‌ దుకాణాలు ఏర్పాటయ్యాయి. వించిపేటలోని పలు హలీమ్‌ సెంటర్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం ప్రారంభించారు.

నెల పొడుపు చూసిన మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. బుధవారం సాయంత్రం నెలపొడుపు కనిపించే అవకాశముంది. గురువారం నుంచి ఉపవాసాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాం. రంజాన్‌ మాసం చాలా పవిత్రమైన నెల. ఈ నెల రోజులు మానవ జీవనాన్ని ఎంతగానే ప్రభావితం చేసే అనేక విషయాలను ఖురాన్‌ వివరించింది. వాటిని ఆచరించటం ద్వారా మానవ జీవన విధానం సన్మార్గంలో పయనిస్తుంది. భగవంతుని కృప లభిస్తుంది.

– నయీమ్‌ ఖదీర్‌, ఇమామ్‌,

షాహీమసీద్‌, విజయవాడ

శుభాల వసంతం.. రంజాన్‌కు సంసిద్ధం 1
1/1

శుభాల వసంతం.. రంజాన్‌కు సంసిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement