వర్సిటీ సమగ్రాభివృద్ధిలో విశేష పురోగతి | - | Sakshi
Sakshi News home page

వర్సిటీ సమగ్రాభివృద్ధిలో విశేష పురోగతి

Feb 18 2026 7:57 AM | Updated on Feb 18 2026 7:57 AM

వర్సిటీ సమగ్రాభివృద్ధిలో విశేష పురోగతి

వర్సిటీ సమగ్రాభివృద్ధిలో విశేష పురోగతి

కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ రాంజీ

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్ధిలో విశేష పురోగతి సాధించిందని వర్సిటీ ఉప కులపతి కె. రాంజీ తెలిపారు. మంగళవారం కృష్ణా యూనివర్సిటీ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ–జాతీయ సహకారం, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి చెందిందన్నారు. దేశీయంగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్‌ బోర్డులు, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు.

అభివృద్ధికి నిధులు..

కేంద్ర ప్రభుత్వ పీఎం ఉష పథకం కింద రూ. 20 కోట్ల గ్రాంట్‌ మంజూరై యూనివర్సిటీ మౌలిక వసతుల అభివృద్ధికి బలమైన మద్దతు లభించిందని వీసీ తెలిపారు. రూ.2.5కోట్లు రావలసిన యూజీసీ క్యాచ్‌–అప్‌ గ్రాంట్‌, రూ. 39కోట్లు ఖేలో ఇండియా నిధుల విడుదలకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

విద్యార్థుల సత్తా..

ఇటీవల 7వ, 8వ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించామని, అచీవర్స్‌ డే, యువ సాంస్కృతిక క్రీడా ఉత్సవాలు, ఇంటర్‌ కాలేజియేట్‌ క్రీడా పోటీలు విజయవంతంగా పూర్తయ్యాయని వీసీ చెప్పారు. పలు యూనివర్సిటీల్లో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు సత్తా చాటారన్నారు. విజయవాడలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ పీజీ సెంటర్‌ స్థాపనకు భవనం కేటాయించామని చెప్పారు. ఉపాధి కోసం జాబ్‌ మేళాలు నిర్వహించి 100 శాతం ప్లేస్‌మెంట్లతో అచీవర్స్‌ డే కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

ప్రభుత్వానికి వినతులు..

ఐడీపీ సమావేశంలో ఆక్వాకల్చర్‌, సెంటర్‌ ఫర్‌ ఎక్స్లెన్స్‌, టెస్టింగ్‌ ఫెసిలిటీస్‌ కోసం రోడ్‌ మ్యాప్‌ సమర్పించామని వీసీ చెప్పారు. రుద్రవరం ప్రాంతంలో 102 ఎకరాలు, గూడూరు ప్రాంతంలో 44.92 ఎకరాల భూముల కేటాయింపుతో పాటు, మచిలీపట్నం పట్టణ పరిధిలో వర్సిటీకి అదనంగా 100 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి ప్రజాప్రతినిధులను కోరినట్లు వెల్లడించారు. రెక్టర్‌ ఎం.వి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్‌ ఎన్‌. ఉష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement