1972 నంబరుపై విస్తృత అవగాహన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 నంబరుకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని కోరారు. ఈ నంబరుపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమావేశం జరిగింది. సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ కె.రామకృష్ణయ్య తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడి క్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్ స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు.
విజయవంతంగా డ్రగ్స్‌పై దండయాత్ర..
జిల్లాలో డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, 34డే యాంటీ డ్రగ్స్ సైకిల్ ర్యాలీలు కూడా జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. అనంతరం సేనో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు.. స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్‌ఫ్రీ నంబరు 1972, ఈగల్ క్లబ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, బి.లక్ష్మీనారాయణ, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామ రాజు, ఈగల్ అధికారులు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, నవజీవన్ బాల్ భవన్, ఆకర్ష ఫౌండేషన్, హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


