‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్య, వైద్య, ఏపీఎస్ ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మునిసిపల్, విద్యుత్, రెవెన్యూ, రవాణా శాఖల అధికారులతో 10వ తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియెట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు.
148 కేంద్రాలు..
పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 148 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, అందులో 11,941 మంది బాలురు, 10,291 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు 2,235 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. పది పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, రూట్ అధికారులు, కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144వ సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంత రాయం లేకుండా సరఫరా చేయాలని, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీఆర్‌ఓ కె. చంద్రశేఖరరావు, ఏఎస్పీ వీవీ నాయుడు, డీఈఓ యూవీ సుబ్బారావు పాల్గొన్నారు.


