ఎంఎంసీకి పన్ను పోటు! | - | Sakshi
Sakshi News home page

ఎంఎంసీకి పన్ను పోటు!

Feb 17 2026 8:58 AM | Updated on Feb 17 2026 8:58 AM

ఎంఎంసీకి పన్ను పోటు!

ఎంఎంసీకి పన్ను పోటు!

ఆర్థిక సంవత్సర ముగింపు దగ్గర పడుతున్నా వసూళ్లు అంతంత మాత్రమే ఇప్పటికి కేవలం 29 శాతమే పన్ను బకాయిల వసూళ్లు పన్నులు చెల్లించకుంటే విద్యుత్‌, కుళాయి కనెక్షన్లు కట్‌ చేస్తామని అధికారుల హెచ్చరిక

మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధిలో వివిధ రకాల పన్నుల వసూళ్లు మందకొడిగా జరుగుతోంది. ఎంఎంసీ సిబ్బందికి తోడు నగరంలోని 50 డివిజన్లలో సచివాలయ ఉద్యోగులు ఉన్నా పన్నుల వసూళ్లు జోరు అందుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతున్నా వసూళ్లు కేవలం 29 శాతం మాత్రమే ఉండడం ఆందోళనకరంగా ఉంది. నగర ప్రజలకు మౌలిక వసతులు, అత్యవసర సేవలు అందించేందుకు వసూలైన పన్ను నిధులనే వినియోగిస్తుంటారు. నగర వాసులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్నులు చెల్లింపులో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. దీంతో ఎంఎంసీ పన్నుల వసూళ్లు, సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎంఎంసీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు, ఆస్తి పన్నులతో పాటు తాగునీటి, ఖాళీ స్థలాల పన్నులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. మార్చి నెలాఖరు లోపు ఈ పన్నులు నూరు శాతం వసూలు కావాల్సింది. ఆ దిశగా ఎంఎంసీ అధికారులు అడుగులు వేయటంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. వసూళ్లకు సంబంధించి బాకీదారులకు రెడ్‌ నోటీసుల జారీ, మైక్‌ ప్రచారం, మొండి బకాయిదారుల పేర్లతో ప్రధాన కూడళ్లలో బోర్డుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాల్సిఉండగా అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారంటున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఖాళీ స్థలాలు వంటి ఆస్తి పన్నుకు సంబంధించి మొత్తం 53,856 అసెస్మెంట్లు ఉండగా వీటి నుంచి పాత పన్ను బకాయి రూ.21.07 కోట్లు, ప్రస్తుత బకాయి రూ.19.09 కోట్లు మొత్తం కలిపి రూ.40.16 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో పాత బకాయిలకు సంబంధించి రూ.2.14 కోట్లు, ప్రస్తుత బకాయికి సంబంధించి రూ.9.60 కోట్లు మొత్తం రూ.11.73 కోట్ల మేర మాత్రమే వసూలయ్యాయి. ఇంకా ఎంఎంసీకి రూ.28.42 కోట్ల మేర పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాగునీటి పన్నులకు సంబంధించి నగరంలో 447 మీటర్‌ తాగునీటి కనెక్షన్లు ఉండగా వీటి నుంచి రూ.2.60 కోట్ల బకాయి వసూలు కావాల్సి ఉంది. 33,257 గృహ తాగునీటి కొళాయిలు ఉండగా వీటి నుంచి రూ.8.04 కోట్ల మేర బకాయి వసూలు కావాల్సి ఉంది. రెండూ కలిపి తాగునీటి పన్ను రూ.10.64 కోట్ల మేర ఎంఎంసీకి వసూలు కావాల్సి ఉంది. ఈ బకాయిలు రానున్న 45 రోజుల్లో వసూలు కావలసి ఉంది. అయితే ప్రతి ఏడాదిలానే రాష్ట్ర ప్రభుత్వం పన్నులపై ఉన్న వడ్డీ రాయితీ ఇస్తుందని, అప్పుడు పన్నులు చెల్లించవచ్చునని కొంతమంది పన్నుదారులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement