మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యకు కడపటి వీడ్కోలు
పలువురు ప్రముఖుల నివాళి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అంత్యక్రియలు సోమవారం ఘనంగా ముగిశాయి. విజయవాడ దుర్గా అగ్రహారంలోని ఆయన నివాసం నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా ఐలాపురం హోటల్, ఏలూరు రోడ్డు, స్వర్ణ కాంప్లెక్స్ మీదుగా స్వర్గపురి వరకు అంతిమ యాత్ర సాగింది. అంతిమ యాత్రలో భాగంగా ఆయన భౌతిక కాయాన్ని ఐలాపురం హోటల్‌లో కొద్దిసేపు ఉంచారు. ఐలాపురం వెంకయ్య మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇంటి వద్ద ఐలాపురం వెంకయ్య భౌతికకాయాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి ఫోన్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
పామర్రు: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ ధీరజ్ వినీల్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని సోమవారం విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పెదపారుపూడి మండలానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఈనెల 7వ తేదీన లైంగిక దాడి జరిగిందని చెప్పారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 5వ తేదీన బాలిక తల్లి పుట్టింటికి వెళ్లిందని, ఇంట్లో ఉన్న సమీప బంధువు బాలికకు స్నానం చేయించిన తర్వాత ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ విషయమై బాలిక తల్లి ఈనెల 14వ తేదీన పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో యాక్టు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పామర్రు సీఐ వి.సుభాకర్, ఎస్‌ఐ–2 కె.విజయ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దర్ని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్ పథకంతో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ఆయన కోవిడ్‌లో తల్లిదండ్రులు ఇద్దర్ని కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్ సహాయాన్ని అందించారు. అనంతరం వారితో ముఖాముఖి మాట్లాడి వారి బాగోగులను తెలుసుకున్నారు. వారిలో 18 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు కోస్టల్ బ్యాంక్ పాస్ పుస్తకాలను అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సమగ్ర సంరక్షణ, రక్షణను అందించటం, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును నిర్ధారించటం, విద్య ద్వారా వారిని శక్తిమంతం చేయటం తదితర అంశాలను ఈ పీఎం కేర్ పథకం ద్వారా నిర్వహిస్తామన్నారు. వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనకు శ్రమించాలని ఉద్భోదించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి బయోడేటాను పంపాలని, వారికి విద్య అవకాశాల కల్పనకు కృషి చేయాలని నైపుణ్యాభివృద్ధి అధికారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సువార్త, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యకు కడపటి వీడ్కోలు


