రామవరప్పాడులో దొంగల బీభత్సం
వరుసగా రెండు గృహాల్లో చోరీ ఒక దొంగను వెంబడించి పట్టుకున్న స్థానికులు ఆధారాలు సేకరించిన క్లూస్ టీం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో సోమవారం మిట్ట మధ్యాహ్నం రెండు గృహల్లో జరిగిన వరుస దొంగతనాలు కలకలం సృష్టించాయి. ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులు అపహరించారు. ఓ ఇంట్లో దుండగుడు దొంగతనానికి పాల్పడుతుండగా స్థానికులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రామాలయం వీధిలో, పిన్నమనేని అపార్టుమెంట్ సమీపంలో వేర్వేరు సమయాల్లో దొంగలు హల్‌చల్ చేశారు. రామాలయం వీధిలో బెజవాడ రఘుకు చెందిన నివాసంలో, పిన్నమనేని హైట్స్ అపార్టుమెంట్ సమీపంలో బాదర్ల బాబి నివాసంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. బాదర్ల బాబి నివాసంలో ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో ఇంట్లోని వారు పని మీద బయటకు వెళ్లారు. తిరిగి ఒంటిగంటకు ఇంటికి చేరుకున్న వీరు ఇంటి తలుపులు తీసి ఉండటం, బీరువాలోని సామాన్లు చిందరవందరగా పడేసి ఉండటాన్ని గుర్తించారు. అనుమానంతో పరిశీలించగా రెండు బంగారు చైన్లు, కొంత నగదు, విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. రామాలయం వీధిలో బెజవాడ రఘు మధ్యాహ్నం సమయంలో తన తల్లితో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వీరు వచ్చేసరికి ఆగంతకుడు ఇంట్లో ఉండటాన్ని గమనించి భయంతో కేకలు వేశారు. వీరిని గమనించిన దుండగుడు బయటకు పరుగులు తీశాడు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి కాపుల బజారులో పట్టుకున్నారు. అతని వద్ద పరిశీలించగా తాళాలు, బీరువాలు పగులగొట్టడానికి వినియోగించే వస్తువులతో పాటు పదునైన ఆయుధాలు ఉండడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని వీధుల్లో సంచరించే సీసీ ఫుటేజీలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసుల విచారణలో దొంగతనానికి గ్రూపుగా వచ్చినట్లు తెలిసింది. స్థానికులకు పట్టుబడిన వ్యక్తి ఢిల్లీకి చెందినవాడిగా గుర్తించారు. ఇతని ద్వారా మిగిలిన దొంగల వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.


